పాశమైలారం ప్రమాద మృతుల కుటుంబాలకు రూ. కోటి పరిహారం.. రేవంత్ రెడ్డి
posted on Jul 1, 2025 @ 2:15PM
పాశమైలారం ప్రమాదం తెలుగు రాష్ట్రాల్లోనే అత్యంత దురదృష్టకరమైన ఘటనగా తెలంగాణ సీఎం రేవంత్ అభివర్ణించారు. ఈ ఘటనలో ఇప్పటివరకు 36 మంది మరణించారని తెలిపారు. మృతులలో బిహార్, ఒడిశా, మధ్యప్రదేశ్, ఏపీ, తెలంగాణ వాసులు ఉన్నారన్న ఆయన.. మృతుల కుటుంబాలకు రూ. కోటి పరిహారం ఇచ్చేలా పరిశ్రమ యాజమాన్యంతో మాట్లాడాలని మంత్రులను ఆదేశించారు.
తీవ్రగాయాలైనవారికి రూ.10 లక్షలు, స్వల్పంగా గాయపడినవారికి రూ.5 లక్షలు పరిహారం ఇవ్వాలన్నారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందన్న భరోసా ఇచ్చారు. ఘటనా స్థలాన్ని సందర్శించి ప్రమాద వివరాలను తెలుసుకున్న ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు.
పాశమైలారం ప్రమాద ఘటనా స్థలాన్ని పరిశీలించిన అనంతరం అధికారులు, మంత్రులతో సమీక్షించారు. ఈ ప్రమాదంపై ఊహాజనిత సమాధానాలు చెప్పవద్దని, ఘటనపై సమగ్ర దర్యాప్తు చేసి పూర్తిస్థాయి నివేదిక సమర్పించాలని ఆదేశించారు. నిపుణులను నియమించి, వారు ఇచ్చిన నివేదిక మాత్రమే తనకు ఇవ్వాలన్నారు.