రౌండప్ 2022.. రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము ఎన్నిక
posted on Dec 25, 2022 @ 2:48PM
కొత్త సంవత్సరం వచ్చేస్తోంది. పాత సంవత్సరానికి వీడ్కోలు పలికే సమయం వచ్చేసింది. 2022 మోస్ట్ హ్యాపెనింగ్ ఇయర్ గా చెప్పుకోవచ్చు. కొద్ది రోజుల్లో 2022 వెళ్ళిపోతుంది. 2023 సంవత్సరం వచ్చేస్తుంది. క్యాలెండరు మారి పోతుంది. స్వాగత తోరణాలు, వీడ్కోలు వేడుకలు షరా మాములే ... కాలచక్రం కదులుతూనే ఉంటుంది... కానీ, వెళ్ళిపోతున్న 2022 సంవత్సరం, ఏమి సాధించింది, ఏమి మిగిల్చింది, ఏది పట్టుకు పోయింది, ఏమి బోధించింది, ఒక సారి వెనక్కి తిరిగి చూసుకుంటే .. సంవత్సర కాలంలో చెరగని ముద్ర వేసిన చేదు తీపి జ్ఞాపకాలను ఒక సారి సింహవలోకనం చేసుకుంటే..
జులై
జులై 1.. నాటకీయ పరిణామాల నడుమ, జూన్ 30 న మహా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన, శివసేన చీలిక వర్గం నేత ఏకనాథ్ షిండే, ప్రభుత్వం శాసన సభ బలపరీక్షలో నెగ్గింది. రాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఎన్సీపీ నేత అజిత్ పవార్’ నియమితులయ్యారు.
జులై 5.. మహారాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందని ప్రధాని నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షా హామీ ఇచ్చారు.
జులై 6.. మరో రోజులో రాజ్యసభ సభ్యత్వం ముగియనున్న నేపధ్యంలో కేంద్ర మంత్రులు ముఖ్తార్ అబ్బాస్ నక్వి, ఆర్సీపీ సింగ్ రాజీనామా చేశారు. నక్వీ రాజీనామాతో కేంద్ర మంత్రివర్గంలో ముస్లిం ప్రాతినిధ్యం లేకుండా పోయిందని విపక్షాలు పేర్కొన్నాయి.
పరుగుల రాణి పీటీ ఉషా, ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజాతో పాటుగా ప్రముఖ సామాజిక కార్యకర్త, దాత వీరేంద్ర హెగ్గాడే, దక్షిణ భారత చలన చిత్ర పరిశ్రమలో పేరెన్నికగన్న కథా, స్క్రీన్ ప్లే రచయిత, వి.విజయేంద్ర ప్రసాద్ రాజ్య సభకు నామినేట్ అయ్యారు.
జులై 8... జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్’ కు సంబంధమున్న 18 వ్యాపార స్థావరాలపై ఈడీ సోదాలు నిర్వహించింది. ప్రివెన్షన్ అఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ ( పిఎంఎల్ఎ) పరిధిలో చర్యలు ఉంటాయని ఈడీ అధికారులు తెలిపారు.
జులై 11..శివసేన థాకరే వర్గం ఎన్డీఎ రాష్ట్రపతి అభ్యర్ధి ద్రౌపతి ముర్ముకు మద్దతు ప్రకటించింది
జులై 18.. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు మొదలయ్యాయి.
రాష్ట్రపతి ఎన్నిక...దేశ 15 వ రాష్ట్రపతిని ఎన్నుకునేందుకు ఈరోజు పోలింగ్ జరిగింది. పది రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో, ఎలెక్టోరల్ కాలేజీలోని సభ్యులు అందరూ ఓటు హక్కు వినియోగించుకున్నారు. నూటికి నూరు శాతం పోలింగ్ నమోదైంది. పార్లమెంట్ భవన్ తో పాటుగా దేశ వ్యాప్తంగా 30 కేంద్రాల (అసెంబ్లీ)లో పోలింగ్ నిర్వహించారు.అధికార ఎన్డీఎ అభ్యర్ధి ద్రౌపతి ముర్ము, ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్ధి యశ్వంత్ సిన్హాలు పోటీలో ఉన్నారు. జులై21న ఫలితాలు వెలువడుతాయి.
జులై21..ఎన్డీఎ రాష్ట్రపతి అభ్యర్ధి ద్రౌపతి ముర్ము 15వ రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. రాష్ట్రపతి పదవికి ఎన్నికైన తొలి గిరిజన మహిళగా 64 ఏళ్ల ద్రౌపతి ముర్ము చరిత్రను సృష్టించారు. జులై 25న ఆమె ప్రమాణస్వీకారం చేస్తారు.
జులై 21..నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసులో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఈడీ ఎదుట విచారణకు హాజరయ్యారు.
జులై 25..
రాష్ట్రపతిగా ఎన్నికైన ద్రౌపతి ముర్ము దేశ 15 వ రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేశారు. దేశ చరిత్రలో రెండవ మహిళా రాష్ట్రపతిగా, ప్రప్రధమ గిరిజన మహిళా రాష్ట్ర పతిగా బాధ్యతలు స్వీకరించిన ముర్ము స్వంతత్ర భారత దేశంలో జన్మించిన తొలి రాష్ట్రపతి కావడం మరో విశేషం. కాగా, రాష్ట్రపతి ముర్ము, అత్యంత పేదరికంలో జన్మించిన తాను రాష్ట్రపతిగా ఎన్నిక కావడం,పేదలు తమ కలలను నిజం చేసుకోవచ్చనేందుకు ఒక నిదర్శనంగా నిలుస్తుందని అన్నారు.
జులై 28..అవినీతి ఆరోపణలపై అరెస్టయిన పశ్చిమ బెంగాల్ మంత్రి పార్థా చట్టేర్జీని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మంత్రి పదవి నుంచి తొలిగించారు.