ప్రాణాలు తీస్తున్న ట్రాఫిక్‌

 

ట్రాఫిక్‌లో గంటల తరబడి ఎదరుచూడటం అంటే ఎవరికి మాత్రం అసౌకర్యంగా ఉండదు. ఇలా ట్రాఫిక్‌లో సమయాన్ని గడపడం వల్ల సమయం ఎలాగూ వృథా అవుతుంది. దానికి తోడు అది మన ఆయుష్షుని కూడా హరించివేస్తుందన్న హెచ్చరిక ఇప్పుడు వినిపిస్తోంది. ఇంగ్లండుకి చెందిన ఒక భారతీయ పరిశోధకుడు అందిస్తున్న నివేదిక, ట్రాఫిక్‌లో చిక్కుబడిపోవడం ఎంతటి ప్రాణాంతకమో సూచిస్తోంది.

 

లక్షల ప్రాణాలు

గాలిలోని కాలుష్యం వల్ల ఏటా లక్షలమంది ప్రాణాలను కోల్పోతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏనాడో హెచ్చరించింది. గాలిలోని కాలుష్యాన్ని పీల్చుకోవడం వల్ల ఆస్తమా, గుండెజబ్బు, పక్షవాతం, ఊపిరితిత్తుల క్యాన్సర్‌ వంటి ప్రాణాంతకమైన జబ్బులెన్నో వ్యాపిస్తాయని తేల్చింది. ఇక ఇంగ్లండులో అయితే రోడ్డు ప్రమాదాల కారణంగా చనిపోయేవారికన్నా, రోడ్ల మీద ఉన్న గాలిలోని కాలుష్యాన్ని పీల్చి చనిపోయేవారి సంఖ్య పదిరెట్లు ఎక్కువ అన్న గణాంకాలు వినిపిస్తున్నాయి. ఈ మాటల్లో నిజమెంతో తేల్చుకునేందుకు ప్రశాంత్‌ కుమార్‌ అనే నిపుణుడు ఒక పరిశోధనను నిర్వహించారు.

 

40 శాతం ఎక్కువ

సాధారణంగా ఇరుకైన రోడ్లు, ట్రాఫిక్‌ సిగ్నల్స్ ఉన్న చోట వాహనాల నుంచి వెలువడే వ్యర్థాల పేరుకుంటూ ఉంటాయి. అక్కడి ట్రాఫిక్‌ నిరంతరాయంగా సాగుతూ ఉండటంతో, విష పదార్థాలు అక్కడి గాలిలోనే స్థిరంగా ఉంటాయి. పరిశోధకులు సేకరించిన వివరాల ప్రకారం, మామూలు రోడ్ల మీదకంటే... కూడలి వద్ద ఉన్న ట్రాఫిక్‌లో 29 రెట్లు అధికంగా ప్రాణాంతక వాయువులు కనిపిస్తున్నాయి. ఇలాంటి చోట్ల వాహనం కనుక నిలిచిపోతే, అక్కడి కాలుష్యం బారిన పడే అవకాశాలు 40 శాతం ఎక్కువగా ఉన్నాయి.

 

 

ఇదీ ఉపాయం!

వీలైనంతవరకూ ట్రాఫిక్‌ లేని దిశగా ప్రయాణం చేయమని చెప్పడం సులువే. కానీ ఇది ఏమంత ఆచరణసాధ్యం కాదు కదా! పైగా కారుల్లో ప్రయాణం చేసే వారి పరిస్థితి మరీ దారుణంగా ఉంటుంది. కారు అద్దాలను మూసేసుకొని లోపల ఫ్యాన్‌ వేసుకుని కూర్చోవడం మినహా, వారికి మరో ఉపాయం తోచదు. అయితే దీనివల్ల పరిస్థితి ఇంకా ప్రమాదకరంగా మారుతుందంటున్నారు. బయటనుంచి గాలిని తీసుకునే ఫ్యాన్లు లోపల ఉండే ప్రయాణికులకు మరింత విషపదార్థాలను అందిస్తాయని హెచ్చరిస్తున్నారు. కాబట్టి ట్రాఫిక్‌లో కనుక ఇరుక్కుపోయి ఉంటే కిటికీ తలుపులను మూసివేసుకుని, ఫ్యాన్లను ఆపివేయమని సూచిస్తున్నారు. ముందు ఉన్న వాహనానికి కాస్త దూరంగా ఉండమంటూ సూచిస్తున్నారు. దీని వల్ల వాహనం చుట్టూ ఉన్న వాయువులను పీల్చే ప్రమాదం 76% తగ్గిపోతుందని చెబుతున్నారు. కానీ వేడి, ఉక్కపోత ఎక్కువగా ఉండే మన దేశంలో ఈ సలహాని పాటించడం సాధ్యమేనా అన్నదే ప్రశ్న!

 

- నిర్జర.