17 మంది జేడీయూ ఎమ్మెల్యేలు జంప్ ? బీహార్ కు కొత్త సీఎం వస్తారనే ప్రచారం
posted on Dec 30, 2020 @ 4:16PM
బీహార్ రాజకీయాల్లో సంచలనం జరగబోతుందనే ప్రచారం జరుగుతోంది. 17 మంది జేడీయూ ఎమ్మెల్యేలు అర్జేడీలో చేరబోతున్నారన్న.. ఆ పార్టీ నేత వ్యాఖ్యలతో పొలిటికల్ హీట్ పెరిగింది. నితీష్ కుమార్ నేతృత్వంలోని జనతాదళ్ యూనైటెడ్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు రాష్ట్రీయ జనతా దళ్ పార్టీలో చేరనున్నట్లు ఆర్జేడీ నేత శ్యామ్ రజక్ అన్నారు. జేడీయూకి చెందిన 17 మంది ఎమ్మెల్యేలు ఏ క్షణమైనా ఆర్జేడీ తీర్థం పుచ్చుకోనున్నట్లు ఆయన చెప్పుకొచ్చారు. అయితే తాము ఫిరాయింపుల చట్టం నిబంధనలను అతిక్రమించబోమని చెప్పిన ఆయన.. 28 మంది ఎమ్మెల్యేలతో కలిసి వస్తే మాత్రం పార్టీలోకి ఆహ్వానిస్తామని స్పష్టం చేశారు.
‘17 మంది జేడీయూ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు మాతో టచ్‌లో ఉన్నారు. వారు ఆర్జేడీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారు. ఇది ఏ క్షణమైనా జరగొచ్చు. ఫిరాయింపుల నిరోధక చట్టం వచ్చినప్పటి నుంచి ఆ చట్టం నిబంధనలను మేం అతిక్రమించడం లేదు. అయితే మేం వారికి ఒక విషయం స్పష్టం చేశాము. 28 మంది ఎమ్మెల్యేలు ఒకేసారి వస్తే చేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. త్వరలోనే ఈ సంఖ్య 28కి చేరే అవకాశం ఉంది’’ అని జేడీయూ నేత శ్యామ్ రజక్ అన్నారు.
శ్యామ్ రజాక్ చేసిన వ్యాఖ్యలతో బీహార్ లో నితీశ్ కుమార్ సర్కార్ కూలిపోబోతుందనే ప్రచారం జరుగుతోంది. అయితే రజాక్ చేసిన వ్యాఖ్యలను ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కొట్టి పారేశారు. ఆర్జేడీ చేస్తున్న వాదనలు నిరాధారమని చెప్పారు. తమ పార్టీ ఎమ్మెల్యేలు ఎవరూ వేరే పార్టీలోకి వెళ్లే అవకాశం లేదని, ఆర్జేడీ తప్పుడుగా ప్రచారం చేస్తోందని తెలిపారు. గత నవంబర్ లో జరిగిన ఎన్నికల్లో జేడీయూ ఆర్జేడీ, బీజేపీ కంటే అతి తక్కువ స్థానాలను గెలుచుకుంది. ఎన్డీయే కూటమిలో బీజేపీకే ఎక్కువ స్థానాలు వచ్చినా.. ఎన్నికల ఒప్పందం ప్రకారం నితీష్‌ను ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు. గతంలోనూ జేడీయూ ఎమ్మెల్యేలను ఆర్జేడీ ప్రలోభ పెడుతుందనే ఆరోపణలు వచ్చాయి. లాలూ ప్రసాద్ యాదవ్ జైలు నుంచే కొందరు నితీశ్ పార్టీ ఎమ్మెల్యేలతో మాట్లాడారని జేడీయూ నేతలు ఆరోపించారు. తాజాగా మళ్లీ ప్రలోభాల ఆరోపణలు రావడం ఆసక్తి రేపుతోంది.