ఒక్క పాయింట్ కోసం.. రెజ్లర్ రితిక ఫొగట్ సూసైడ్
posted on Mar 18, 2021 @ 3:07PM
ఒక్క పాయింట్. ఒకే ఒక్క పాయింట్. ఆమె ఓడిపోయేలా చేసింది. ఫైనల్‌లో ఒక్క పాయింట్ తేడాతో టైటిల్ కోల్పోవాల్సి వచ్చింది. తీవ్ర నిరాశకు లోనైన ఆ క్రీడాకారిణి ఆత్మహత్య చేసుకుంది. ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. పోరాటానికి, గెలుపునకు మారు పేరైన ఫొగట్ ఫ్యామిలీలో ఈ విషాదం చోటు చేసుకోవడం బాధాకరం.
బాలీవుడ్ సూపర్‌హిట్ మూవీ దంగల్ గుర్తుందిగా. ఆ సినిమా మహావీర్ ఫొగట్ కుటుంబ నిజజీవిత కథ. ఆ గీతా, బబిత ఫొగట్‌ల కజిన్ సిస్టర్ రితిక ఫొగట్(17). ఆమె సైతం మంచి రెజ్లరే. మహావీర్ ఫొగాట్ అకాడమీలో రితిక ఐదేళ్లుగా రెజ్లింగ్‌లో శిక్షణ తీసుకుంటోంది. తాజాగా జరిగిన స్టేట్ లెవెల్ జూనియర్ ఉమెన్, సబ్ జూనియర్ పోటీల్లో రితిక పోటీ పడింది. మంచి ప్రతిభ కనబరిచి ఫైనల్‌కు చేరుకుంది. ఈ నెల 14న జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో కేవలం ఒక్క పాయింట్ తేడాతో ఓడిపోయింది. ఈ ఓటమితో ఆమె తీవ్ర నిరాశకు గురైంది. అప్పటి నుంచి మానసికంగా కుంగిపోయింది. మహావీర్ ఫొగట్ ఇంట్లోని తన గదిలో ఉరి వేసుకొని చనిపోయింది. పోరాటానికి మారు పేరైన ఫొగట్ ఫ్యామిలీ మెంబర్.. ఇలా నిజజీవితంలో ఫైటింగ్ స్పిరిట్‌ను మరిచి సూసైడ్ చేసుకోవడం విషాదకరం.