జగన్ హయాంలో రివర్స్ పాలన.. జీవోలు గోప్యం.. నిఘా నివేదికలు బహిర్గతం!
posted on Oct 25, 2022 @ 11:05AM
రివర్స్ టెండర్లంటూ ఆరంభించిన జగన్ సర్కార్.. పాలననే రివర్స్ చేసి పారేసింది. ఏ ప్రభుత్వమైనా తనకు నిఘావర్గాల(ఇంటెలిజెన్స్) ద్వారా వచ్చిన సమాచారాన్ని గోప్యంగా ఉంచుతుంది. ఆ వర్గాల సమాచారం మేరకు అప్రమత్తమౌతుంది. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నివారిస్తుంది. అలాగే పాలనలో భాగంగా జారీ చేసే ప్రభుత్వ ఉత్తర్వులను పబ్లిక్ డొమైన్ లో ఉంచి.. ప్రజారంజకంగా పాలించేందుకు తాను చేస్తున్న ప్రయత్నాలను ప్రజలకు వివరిస్తుంది.
అయితే ఏపీలో జగన్ సర్కార్ మాత్రం అందుకు రివర్స్ లో వ్యవహరిస్తున్నది. ఏపీ సర్కార్ ఇంటెలిజెన్స్ నివేదికలు లీక్ చేస్తూ.. జీవోలను మాత్రం అత్యంత గోప్యంగా ఉంచుతోంది. జీవోలను పబ్లిక్ డొమైన్ లో ఉంచాలన్న కోర్టు ఉత్తర్వులను సైతం బేఖాతరు చేస్తున్నది. 13 మంది జనసేన కార్యకర్తలు మంత్రులపై దాడి చేయవచ్చన్న ఇంటెలిజెన్స్ నివేదిక సోషల్ మీడియాలో, మీడియాలో హల్ చల్ చేయడమే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ.
ఆ ఇంటెలిజెన్స్ నివేదికకు అనుగుణంగా పోలీసులు మంత్రులకు భద్రత పెంచారు. ఇంటెలిజెన్స్ నివేదిక లీక్ కావడం అంటే ప్రభుత్వం విఫలమైనట్లుగానే భావించాల్సి ఉంటుంది. అసలు ఇంటెలిజెన్స్ నివేదిక బయటకు పొక్కితే దానిపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది.
కానీ సర్కార్ తీరు అందుకు పూర్తి భిన్నంగా ఉంది. లీకైన ఇంటెలిజెన్స నివేదికను సాకుగా చూపి జనసేన కేడర్ పై విమర్శలు గుప్పించడానికీ, వారిపై నిర్బంధం పెంచడానికి ప్రభుత్వం ఉపయోగించుకుంటున్న తీరు చూస్తుంటే ప్రభుత్వమే ఈ నివేదికను లీక్ చేసిందా అన్న అనుమానాలు రాజకీయ వర్గాలలో వ్యక్తమౌతున్నాయి.