రేవంత్ ఉప్పెన.. జస్ట్ టీజర్ మాత్రమే..

ఒక్కడు కదిలాడు. ఒక్కో అడుగు ముందుకేశాడు. ఉప్పెనలా ఉప్పొంగాడు. రైతు కోసం రావిరాలలో రణభేరి మోగించాడు. రేవంత్ రెడ్డి సత్తా ఏంటో మరోసారి ఎలుగెత్తి చాటాడు. త్వరలోనే తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్రను ప్రకటించాడు. సునామీలా తిరిగి ఉప్పెన సృష్టిస్తానని.. ఆ ఉప్పెనలో కేసీఆర్‌ను కప్పేస్తానని, టీఆర్‌ఎస్ ను గద్దె దించుతానని.. సమరశంఖం పూరించాడు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి.

కేసీఆర్ భుజం మీదుగా మోదీపై గురి..

రావిరాల సభతో రేవంత్ రెడ్డి భవిష్యత్ రాజకీయంపై ఓ అంచనాకు రావొచ్చు. కేసీఆర్ భుజాల మీదుగా కేంద్రంపై వ్యవసాయ చట్టాలపై ఫిరంగి పేల్చిన తీరుకు విమర్శకుల నుంచే ప్రశంసలు వస్తున్నాయి. కేంద్ర చట్టాలను సవరించుకునే అవకాశం రాష్ట్రాలకు ఉంటుందని గుర్తుచేస్తూ.. కేంద్ర బంతిని రాష్ట్ర కోర్టులోకి నెట్టారు. కేసీఆర్ మోదీ జట్టు వీడి.. సాగు చట్టాలపై అసెంబ్లీలో తీర్మానం చేసి పంపాలంటూ గులాబీ బాస్ ను బోనులో నిలబెట్టే ప్రయత్నం చేశారు.  రావిరాల వేదికగా కేంద్ర, రాష్ట్రాలకు వ్యతిరేకంగా రేవంత్ రెడ్డి పంపిన మెసేజ్ ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లిపోయింది.

ఢిల్లీ డైరెక్షన్ లోనే..

చెప్పేశారు. రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చేశారు. పాదయాత్రతో తన రాజకీయ బాటను మరింత సుస్థిరం చేసుకోనున్నట్టు రావిరాల సభలో రాష్ట్ర వ్యాప్త పాదయాత్రను ప్రకటించి రేవంత్ రెడ్డి సంచలనం సృష్టించారు. కాంగ్రెస్‌ అధినాయకత్వం ఆదేశం మేరకే రూట్‌ మ్యాప్‌ ఉంటుందని స్పష్టం చేసి తన గాడ్ ఫాదర్ ఢిల్లీనే అంటూ సంకేతాలు పంపించేశారు. 10 జన్ పథ్ అనుమతితోనే కాంగ్రెస్ లో తన రాజకీయ ప్రస్థానం కొనసాగుతుందని.. లోకల్ సీనియర్లకు చెప్పకనే చెప్పేశారు.

నాతో వచ్చేదెవరు.. నాతో నడిచేదెవరు..

తేలిపోయింది. రావిరాల సభతో రేవంత్ రెడ్డితో కలిసి నడిచేదెవరో తేలిపోయింది. కాంగ్రెస్ లో  ఎవరు ఏ గ్రూపో పాలు, నీళ్లలా తేలిపోయింది. నో డౌట్. సీతక్కే ఆ లిస్ట్ లో అందరికన్నా ముందున్నారు. టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్లు పొన్నం ప్రభాకర్‌, కుసుమ్‌కుమార్‌, కేంద్ర మాజీ మంత్రి బలరాంనాయక్‌, మాజీ మంత్రులు చిన్నారెడ్డి, కొండా సురేఖ, మాజీ ఎంపీలు సురేష్‌ షెట్కార్‌, సిరిసిల్ల రాజయ్య, మల్లు రవి, కూన శ్రీశైలం గౌడ్‌, టి.రామ్మెహన్‌రెడ్డి, మల్‌రెడ్డి రంగారెడ్డి, దాసోజు శ్రావణ్‌, అనిల్‌కుమార్‌ యాదవ్‌, రంగారెడ్డి డీసీసీ అధ్యక్షుడు నర్సింహారెడ్డితో పాటు పలువురు డీసీసీ అధ్యక్షులు రేవంత్‌ రెడ్డి సభకు హాజరు కావడంతో వీరంతా ఆయన బ్యాచ్ అంటూ ప్రచారం మొదలైపోయింది. ఇక.. సభకు రాని వారిలో హేమాహేమీలే ఉన్నారు. కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌ మాణిక్కం ఠాగూర్‌, టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, జానారెడ్డి, వి.హన్మంతరావు, దామోదర రాజనర్సింహ, జగ్గారెడ్డి, శ్రీధర్‌బాబు, పొన్నాల లక్ష్యయ్య, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి తదితరులు మీటింగ్ కు అటెండ్ అవలేదు. అయితే.. రణభేరి సభ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించిన ప్రొగ్రామ్ కాదని వారంతా బయటకు చెబుతున్నా.. ఆ సో కాల్డ్ సీనియర్లంతా రేవంత్ రెడ్డి ఎదుగుదలను చూసి ఓర్వలేని వారేనంటున్నారు ఆయన అభిమానులు.

ఆసక్తిరేపిన సురీడు..

రేవంత్ రెడ్డి నిర్వహించిన రణభేరి సభలో జరిగిన రెండు ఆసక్తికర అంశాలపై జోరుగా చర్చ జరుగుతోంది. వైఎస్సార్ సీఎంగా ఉన్నప్పుడు నిత్యం ఆయన వెన్నంటే ఉండేవాడు వ్యక్తిగత అనుచరుడు సురీడు. వైఎస్ మరణం తర్వాత బహిరంగంగా సురీడు కనిపించింది లేదు. అలాంటిది రేవంత్ రెడ్డి సభలో అనూహ్యంగా ప్రత్యక్షమయ్యాడు ఆ సురీడు. ఇప్పటి వరకూ ఏ జగన్ సభలోనూ, ఏ షర్మిల మీటింగ్ లోనూ జాడ లేని సూరీడు సడెన్ గా రేవంత్ రెడ్డి రణభేరిలో ఎందుకు ఎంట్రీ ఇచ్చాడనే దానిపై పొలిటికల్ ఇంట్రెస్ట్ పెరిగింది.

నాడు వైఎస్.. నేడు రేవంత్ -కొండా సురేఖ కామెంట్స్

రణభేరి సభలో కీలక నేత కొండా సురేఖ చేసిన కామెంట్స్ భవిష్యత్ పరిణామాలపై ఓ అంచనాకు వచ్చేలా చేస్తున్నాయి. రేవంత్ రెడ్డి పాదయాత్రను.. గతంలో వైఎస్సార్ చేసిన యాత్రతో పోల్చారు కొండా సురేఖ. తనకు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గుర్తొస్తున్నారంటూ ఆమె చేసిన కామెంట్స్ సైతం వ్యూహాత్మకమే అంటున్నారు. ఆనాడు కాంగ్రెస్ కు వైఎస్ ఎలానో.. ఈనాడు హస్తం పార్టీలో రేవంత్ రెడ్డి స్థాయి కూడా అలాంటిదేనంటూ పరోక్షంగా ప్రస్తావించారని చెబుతున్నారు. అప్పట్లో వైఎస్సార్ కు బలమైన మద్దతుదారుగా ఉన్న కొండా దంపతులు.. ఫ్యూచర్ లో రేవంత్ రెడ్డికి సైతం స్ట్రాంగ్ సపోర్టర్స్ గా నిలిచే ఛాన్స్ ఉందని విశ్లేషిస్తున్నారు.

రావిరాల సభతో  కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డి స్ట్రామినా ఏంటో.. అది ఉప్పెనలా ఉప్పొంగి, తెలంగాణలో సృష్టించే పొలిటికల్ సునామీ ఎంతో స్పష్టమైంది. రేవంత్ రెడ్డి బలం, బలగం, భవిష్యత్ పై క్లారిటీ వచ్చేసింది. ఈ సభ జస్ట్ టీజర్ మాత్రమే. ట్రైలర్ మరింత అదిరిపోతుందని..  పిక్చర్ అబీ బాకీ హై అంటున్నారు ఫ్యాన్స్.