జీ బ్లాక్ కింద నిజాం ఖజానా.. కేసీఆర్ ఆ 11 రోజులు ఎక్కడికి పోయారు?
posted on Jul 14, 2020 @ 4:32PM
సీఎం కేసీఆర్ 11 రోజులు కనిపించకుండా పోవడంపై అనుమానాలు ఉన్నాయని కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. జూన్ 29న సచివాలయాన్ని కూల్చొద్దని తాము కోర్టుకు వెళ్లామని, అయితే ప్రభుత్వ క్యాబినెట్ నిర్ణయాలపై తాము జోక్యం చేసుకోలేమంటూ హైకోర్టు తీర్పునిచ్చిందని పేర్కొన్నారు. ఆ రోజు నుంచి కేసీఆర్ కనిపించకుండా పోయారని, మళ్లీ జులై 10న సచివాలయం కూల్చివేతపై హైకోర్టు స్టే ఇవ్వగా.. ఆ మరుసటి రోజే కేసీఆర్ ప్రత్యక్షమయ్యారని రేవంత్ చెప్పుకొచ్చారు. ఈ 11 రోజులు కేసీఆర్ ఎక్కడికి పోయారో చెప్పాలని ప్రశ్నించారు. దీనిపై తమకు అనుమానాలు ఉన్నాయని రేవంత్ రెడ్డి అన్నారు.
ఇక సచివాలయం చుట్టూ 3 కిలోమీటర్లు రాకపోకలు బంద్ చేసి కూల్చివేతలు చేశారని రేవంత్ రెడ్డి అన్నారు. దీనిపై అనుమానం రావడంతో ఎంక్వైరీ చేయగా.. నిధి అన్వేషణ జరుగుతుందనే విషయాలు తెలిశాయన్నారు. జీ బ్లాక్ కింద నిజాం ఖజానా ఉందనే వార్తలను గతంలో పత్రికలు ప్రచురించాయని, అక్కడ అన్వేషణ కోసం అవకాశం ఇవ్వాలని గతంలో పురావస్తు శాఖ జీహెచ్ఎంసీకి లేఖ కూడా రాసిందని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. ఇప్పుడు అక్కడే తవ్వకాలు జరపడంపై అనేక అనుమానాలు ఉన్నాయని తెలిపారు. మంచి కార్యక్రమాలు ఎప్పుడైనా పగలే చేస్తారని, గుప్త నిధుల తవ్వకాలు మాత్రమే అర్థరాత్రి చేస్తారని ఆరోపించారు. కూల్చివేతకు ముందు జి బ్లాక్ కింద పురావస్తు శాఖ చేత పరిశోధన జరిపించాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. హైకోర్టు దీన్ని సుమోటోగా స్వీకరించి ఒక కమిటీ వేయాలని రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.