రిటైర్డ్ ఉద్యోగుల సేవలు ఇక చాలు.. రేవంత్ సర్కార్ నిర్ణయం
posted on Jan 17, 2024 8:55AM
తెలంగాణ రాష్ట్రంలో పదవీ విరమణ తరువాత కూడా ప్రభుత్వ సర్వీసులలో ఎక్స్ టెన్సన్ పై కొనసాగుతున్న అధికారుల సేవలను ఉపయోగించుకోరాదని రేవంత్ ప్రభుత్వం నిర్ణయించింది. గత ప్రభుత్వ హయాంలో రిటైరయినప్పటికీ తమ పదవుల్లో కొనసాగుతున్న వారిని ఇక సాగనంపాలని నిర్ణయించింది.
పదవీ విరమణ తరువాత కూడా సర్వీసుల్లో కొనసాగుతున్న వారి జాబితా పంపాలని అన్ని ప్రభుత్వ శాఖలకూ తాజాగా ఉత్తర్వులు జారీ అయ్యాయి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంత కుమారి ఈమేరకు అన్ని ప్రభుత్వ శాఖలకు సర్క్యులర్ జారీ చేశారు. ఆ జాబితాను బుధవారం సాయంత్రం 5 గంటలలోగా అందజేయాలని ఆ ఉత్తర్వులలో ఆదేశించారు. కేసీఆర్ హయాంలో రిటైర్ అయిన ఆఫీసర్లను ఇష్టారాజ్యంగా కొనసాగించారనీ, తమకు అనుకూలంగా పనులు చేయించుకున్నారన్న ఆరోపణలు పెద్ద ఎత్తున ఉన్న నేపథ్యంలో రేవంత్ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుందని అంటున్నారు.
ఇలా పదవీ విరమణ తరువాత కూడా అధికారులను కొనసాగించడం వల్ల అర్హులకు ప్రమోషన్లు ఆగిపోయాయి. వారంతా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇలా పదవీ విరమణ తరువాత కూడా సర్వీసుల్లో కొనసాగుతున్న వారు వందల సంఖ్యలో ఉంటారని చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే రిటైర్మెంట్ అనంతరం కూడా పదవుల్లో కొనసాగుతున్న వారు ఎంత మంది అన్నదానిపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. అందుకే అటువంటి వారి జాబితాను అందజేయాల్సిందిగా ఉత్తర్వులు జారీ చేసింది. ఆ జాబితా అందిన తరువాత వారికి ఉద్వాసన పలికే అవకాశాలు ఉన్నాయి.
పదవీ విరమణ పొందిన తరువాత కూడా పలువురు అధికారులు గత ప్రభుత్వ ఆశీస్సులతో వివిధ స్థాయులలో విధులలో కొనసాగుతున్నారు. వివిధ ప్రభుత్వ శాఖలు, కార్పొరేషన్లు, బోర్డులలో పని చేస్తోన్న వారి వివరాలను బుధవారం సాయంత్రం ఐదు గంటలలోపు నిర్ణీత నమూనాలో ఇవ్వాలని ముఖ్య కార్యదర్శులు, శాఖాధిపతులను శాంత కుమారి ఆదేశించారు.