హైల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాసరావుకు ఉద్వాసన
posted on Dec 20, 2023 @ 4:32PM
తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్‌రావు. రాష్ట్ర ప్రజలెవరికీ పరిచయం అక్కర్లేని పేరు. ఆరోగ్య శాఖ అధికారిగా కంటే బీఆర్ఎస్ ప్రతినిధిగానే ఆయన తన విధులను నిర్వర్తించారన్న విమర్శలు ఎదుర్కొన్నారు. ఒక కోవిడ్ సమయంలో ఎప్పటికప్పుడు ప్రెస్‌మీట్లు పెట్టి.. కొవిడ్ అప్‌డేట్స్ ఇచ్చారు. కోవిడ్ నుంచి రక్షణ కోసం మాస్కు ధరించడం తప్పనిసరి అంటూ చెప్పే ఆయనే.. ఓ మీడియా సమావేశానికి మాస్క్ లేకుండా రావడం.. ఓ వేడుకలో మాస్క్ లేకుండా డ్యాన్సులు చేయడం అప్పట్లో తెగ వైరల్ అయింది.
తెగ వివాదాస్పదం కూడా అయ్యింది, అప్పట్లో ఈయన తీరుపై సర్వత్రా విమర్శలు వచ్చాయి. అంతే కాదు.. ఖమ్మంలో క్షుద్ర పూజలు నిర్వహించి కూడా వార్తల్లో నిలిచారు. ఇక కోవిడ్ ఉధృతి తగ్గిన తరువాత ఆయన రాజకీయ ప్రవేశం కోసం చేయని ప్రయత్నం లేదు. విధులను ఎగ్గొట్టి మరీ ఆయన పోటీ చేయాలని ఆశించిన కొత్తగూడంలో విస్తృత పర్యటన చేశారు. తనకు కోవిడ్ సమయంలో వచ్చిన లేదా వచ్చిందని ఆయన భావిస్తున్న గుర్తింపు కారణంగా తనను తాను ఎక్కువగా ఊహించుకుని ఎన్నికలలో పోటీ చేయడానికి రెడీ అయిపోయారని బీఆర్ఎస్ లోనే అప్పట్లో ఆయనపై సెటైర్లు పేలాయి. ఇక విషయానికి వస్తే ఎన్నికలలో బీఆర్ఎస్ టికెట్ శ్రీనివాసరావుకు దక్కలేదు. దీంతో ఆయన పొలిటికల్ డ్రీమ్ కలగానే మిగిలిపోయింది.
అధికార పార్టీ అండతో విధినిర్వహణలో ఇష్టారాజ్యంగా వ్యవహరించి ‘పాపులర్’ అయిన డీహచ్ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరగానే సైలెంట్ అయిపోయారు. అయితే అధికారిగా ఆయన తీరు కారణంగా ఆయనకు కాంగ్రెస్ సర్కార్ ఉద్వాసన పలికింది. తెలంగాణ హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాసరావు స్థానంలో డాక్టర్ రవీంద్రనాయక్ ను నియమిస్తూ బుధవారం (డిసెంబర్ 20)న ఉత్తర్వులు జారీ చేసింది. గడల శ్రీనివాసరావు గత సర్కార్ తో సన్నిహితంగా మెలిగేవారు.
అలాగే కొత్తగూడెం అసెంబ్లీ స్థానం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేయనున్నట్లు అప్పట్లో ఆయకు ఆయనే ప్రకటించుకున్నారు. నియోజకవర్గంలో పర్యటనలు సైతం చేశారు. మొత్తం మీద ఆయనకు రేవంత్ సర్కార్ హెల్త్ డైరెక్టర్ గా ఉద్వాసన పలికింది. ఇప్పుడు ఆయన పోస్టింగ్ ఎక్కడ ఇస్తారన్నది తెలియాల్సి ఉంది.