పడి లేచిన కెరటం రేవంత్ రెడ్డి!
posted on Dec 3, 2023 @ 10:25AM
గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఓడిపోయిన వ్యక్తి, ఈ ఎన్నికల్లో పోటీ చేసిన రెండు చోట్లా ముందుంజలో ఉండటమే కాకుండా తమ పార్టీని అధికారం దిశగా పరుగులు పెట్టించడం సాధ్యమేనా? అంటే రేవంత్ రెడ్డి లాంటి నాయకుడికి సాధ్యమనే చెప్పాలి.
2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో అధికార పార్టీ బీఆర్ఎస్ ప్రత్యేక దృష్టి పెట్టి మరీ కొడంగల్ లో కాంగ్రెస్ నాయకుడు రేవంత్ రెడ్డిని ఓడించింది. అయినప్పటికీ ఆ ఓటమితో కృంగిపోని రేవంత్, 2019 లోక్ సభ ఎన్నికల్లో మల్కాజ్ గిరి ఎంపీగా గెలిచారు. అలాగే టీపీసీసీ చీఫ్ గా కాంగ్రెస్ లో నూతనోత్సాహాన్ని తీసుకొచ్చి, తెలంగాణలో విజయం దిశగా పార్టీని పరుగులు పెట్టించారు.
ఈ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ తో పాటు, కేసీఆర్ బరిలో నిలిచిన కామారెడ్డిలో పోటీ చేశారు రేవంత్. అయితే ఇప్పుడు ఈ రెండు స్థానాల్లోనూ ఆయన ముందుంజలో ఉండటం విశేషం. అంతేకాదు కాంగ్రెస్ కూడా తెలంగాణలో 119 స్థానాలకు గాను 65 స్థానాలకు పైగా లీడ్ లో ఉండి, ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయంగా కనిపిస్తోంది. రేవంత్ రెండు చోట్లా గెలవడంతో పాటు, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఇది గొప్ప విషయంగానే చెప్పాలి.