రిటైర్మెంట్ పై తేల్చిచెప్పిన సచిన్
posted on Apr 5, 2011 @ 10:20AM
న్యూఢిల్లీ: అంతర్జాతీయ వన్డేల నుంచి ఇప్పట్లో వైదొలిగే ఆలోచనే లేదని బ్యాటింగ్ దిగ్గజం సచిన్ స్పష్టం చేశాడు. భారత్‌కు ప్రాతినిధ్యం వహించాలన్నదే తన కోరికని, గతంలో కంటే ఇప్పుడే ఆటను బాగా అస్వాదిస్తున్నానని అన్నాడు. వన్డే ఫార్మాట్‌కు గుడ్ బై చెప్పి టెస్టు కెరీర్‌ను పొడగించుకునే ఆలోచనలో ఉన్నాడనే ఊహాగానాలు రావడంతో మాస్టర్ వివరణ ఇచ్చాడు. తన మనసులో రిటైర్మెంట్ అనేది లేదని చెప్పాడు. ఆ సమయం వచ్చినపుడు అందరికీ చెబుతానని సచిన్ వ్యాఖ్యానించాడు. 'క్రికెట్‌పై ఆసక్తి ఏ మాత్రమూ తగ్గలేదు. ఆట పట్ల అంకితభావం ఉండటం వల్లే సుదీర్ఘకాలం నుంచి కెరీర్ కొనసాగిస్తున్నా. ఇప్పుడు కూడా నా దృక్పధంలో మార్పు లేదు. కెరీర్ కొనసాగించడంపైనే దృష్టిసారిస్తున్నా' అని సచిన్ చెప్పాడు. వచ్చే ప్రపంచ కప్‌లోనూ ఆడతారా అన్న ప్రశ్నకు.. ఆ విషయం గురించి ఆలోచించడం లేదని, ప్రపంచ కప్ విజయ మాధుర్యాన్ని ఆస్వాదిస్తున్నానని అన్నాడు. తన కెరీర్‌లో భారత్‌కు సారథ్యం వహించిన వారందరి కంటే ధోనీయే బెస్ట్ కెప్టెన్ అని సచిన్ కితాబిచ్చాడు. కోచ్ గ్యారీ కిర్‌స్టెన్ భారత్ కోచ్‌గా కొనసాగాలని సచిన్ ఆకాంక్షించాడు. అయితే, గ్యారీకి కొన్ని బాధ్యత లు ఉన్నందున అతని నిర్ణయాన్ని గౌరవిస్తానని తెలిపాడు.