స్వేచ్ఛకి సాటేది!
posted on Oct 8, 2020 @ 9:30AM
అనగనగా ఓ అందమైన చిలుక! అడవిలో తన నేస్తాలతో కలసి ఆడుతూ పాడుతూ ఉండే ఆ చిలుక కాస్తా ఆ దారిన పోతున్న ఓ వర్తకుడి కంట్లో పడింది. అంతే! అదను చూసి దాన్ని తన సంచిలో వేసుకుని ఇంటికి పట్టుకుపోయాడు ఆ వర్తకుడు. వర్తకుడి ఇంట్లో చిలుకకి అన్నీ ఉండేవి… ఒక్క స్వేచ్ఛ తప్ప! వెండి పంజరంలో దాన్ని బంధించి, బంగారు పళ్లెంతో దానికి ఆహారాన్ని అందించేవాడు వర్తకుడు. అయినా చిలుక మనసంతా అడవి మీదే ఉండేది. ఇదిలా ఉండగా ఆ వర్తకుడు వ్యాపారం చేసేందుకు మళ్లీ బయల్దేరాల్సిన సమయం ఆసన్నమైంది.
‘చూడూ! నేను మళ్లీ నీ కుటుంబం ఉండే అడవిగుండానే వెళ్తున్నాను. అక్కడ నీ నేస్తాలతో ఏదన్నా సందేశాన్ని అందించాల్సి ఉంటే చెప్పు!’ అన్నాడు వర్తకుడు.
‘సరే! నా కుటుంబం ఉండే ఆ మామిడి చెట్టు మీకు గుర్తే కదా! అక్కడికి వెళ్లి మీ తోటి చిలుక చాలా బాధలో ఉంది అని చెప్పండి. ఏదో తిండీ తిప్పలూ వెల్లమారిపోతున్నాయే కానీ స్వేచ్ఛ కరువైందని చెప్పండి. తను ఎక్కడున్నా తన మనసు మీతోనే ఉంటుందనీ, మిమ్మల్ని కలిసే క్షణం కోసం ఎదురు చూస్తూ ఉంటుందనీ చెప్పండి.’ అంది చిలుక.
చిలుక చెప్పిన సందేశాన్ని తీసుకుని వర్తకుడు అడవిగుండా ప్రయాణాన్ని సాగించాడు. అక్కడ అతనికి చిలుక కుటుంబం నివసించే మామిడి చెట్టు కనిపించింది. ఆ చెట్టు కింద నిలబడి వర్తకుడు ‘మీ తోటి చిలుక నా దగ్గరే ఉంది. అది మీ అందరి తోడునీ, ఈ అడవిలోని స్వేచ్ఛనీ కోరుకుంటోంది. కానీ ఏం చేసేది! నాకు ఆ చిలుక అంటే ప్రాణం. అందుకనే దాన్ని వదిలిపెట్టలేను. అందుకే కేవలం దాని సందేశాన్ని మాత్రమే తీసుకువచ్చాను. ఇప్పడు మీ సందేశం ఏదన్నా ఉంటే చెప్పంది. నేను తనకి అందిస్తాను’ అన్నాడు.
వర్తకుడి మాటలు వింటూనే ఓ చిలుక చెట్టు మీద నుంచి ఢామ్మని పడిపోయింది. జరిగిన దానికి వర్తకుడు కంగారుపడిపోయి మారుమాట్లాడకుండా ముందుకు సాగిపోయాడు. వ్యాపారాన్ని ముగించుకున్న వర్తకుడు ఇంటికి తిరిగి రానే వచ్చాడు. ‘ఏం జరిగింది! నా సందేశాన్ని మా కుటుంబానికి అందించారా? వారు ఏమన్నారు?’ అని అడిగింది చిలుక.
‘ఆ నీ సందేశాన్ని అందిచాను. కానీ… కానీ… నా మాటలు వినగానే ఓ చిలుక ఢామ్మని చెట్టు మీద నుంచి కిందకి పడిపోయింది’ అన్నాడు వర్తకుడు. ఆ మాటలు వింటూనే పంజరంలోని చిలుక కూడా ఒక్క పెట్టున కుప్పకూలిపోయింది.
‘అరెరే! అక్కడ జరిగిందే నాకు అర్థం కావడం లేదంటే, ఇదేంటి….’ అనుకుంటూ లబోదిబోమంటూ వర్తకుడు పంజరాన్ని తెరిచి ఆ చిలుకను చేతిలోకి తీసుకున్నాడు. వర్తకుడు అలా చిలుకను చేతిలోకి తీసుకున్నాడో లేదో ఒక్క ఉదుటున ఆ చిలుక ఎగిరిపోయి తలుపు దగ్గరకి చేరుకుంది.
‘నా నేస్తాలు నాకందించిన సందేశం ఇదే! ఎవరైనా మమ్మల్ని బంధిస్తే ఇలా తప్పించుకోవాలని మా పెద్దలు చెప్పేవారు. నేను ఆ విషయమే మర్చిపోయాను. ఇప్పడు మళ్లీ నాకు ఆ ఉపాయాన్ని గుర్తుచేశారుగా. ఇక బయల్దేరతాను.’ అంది చిలుక.
‘మరి నా సంగతో! నేను నిన్ను ఇంతగా ప్రేమించాను. నీకోసం వెండి, బంగారాలు అందించాను. మూడుపూటలా నచ్చిన ఆహారాన్ని ఇచ్చాను. ఇవన్నీ వదులుకుని నువ్వు వెళ్లిపోతావా!’ అంటూ బేలగా అడిగాడు వర్తకుడు.
‘ప్రపంచంలో ఏ జీవికైనా బానిసత్వాన్ని మించిన దౌర్భాగ్యం ఉండదు. స్వేచ్ఛే కనుక లేకపోతే కడుపు నిండినా తృప్తిగా ఉండదు. బంగారంతో చేసినా కానీ పంజరం పంజరమే! అది నాకు వద్దు. దాని బదులు ఎండిన చెట్టు మీద ఖాళీ కడుపుతో కూర్చున్నా బతికున్నాననీ, నా జీవితం నే చేతిలోనే ఉందనీ తృప్తిగా ఉంటుంది. సెలవ్!’ అంటూ తుర్రుమంది చిలుక.