ఐఆర్ఆర్ కేసులో చంద్రబాబుకు ఊరట
posted on Oct 11, 2023 @ 3:31PM
తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడికి హైకోర్టులో ఊరట లభించింది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్లు, అంగళ్లు కేసుల్లో చంద్రబాబుకు హైకోర్టులో ఊరటదక్కింది. అంగళ్లు కేసులో చంద్రబాబును గురువారం (అక్టోబర్ 12), ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో అక్టోబర్ 16 వరకూ అరెస్టు చేయవద్దని ఏపీ హై కోర్టు బుధవారం (అక్టోబర్ 11) ఉత్తర్వులు ఇచ్చింది.
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు, అంగళ్లు కేసుల్లో తెదేపా అధినేత చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లపై హైకోర్టులో బుధవారం (అక్టోబర్ 11) విచారణ జరిగింది. ఈ రెండు కేసుల్లోనూ చంద్రబాబును అరెస్టు చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోర్టును ఆయన తరఫు న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ కోరారు. కేసుల్లో విచారణకు సహకరిస్తామని న్యాయస్థానానికి తెలిపారు. ఈ విషయంపై సీఐడీ, హోంశాఖతో మాట్లాడి చెప్పాలని ప్రభుత్వ న్యాయవాదులకు హై కోర్టు సూచించింది. ఏసీబీ కోర్టులో పీటీ వారెంట్ పెండింగ్‌లో ఉందని కోర్టుకు ఏజీ శ్రీరామ్ తెలిపారు. ఈ దశలో చంద్రబాబుకు ముందస్తు బెయిల్ ఇవ్వొద్దని కోరారు. ఇరువైపుల వాదనలు విన్న ధర్మాసనం రెండు కేసుల్లోనూ చంద్రబాబుకు ముందస్తు బెయిలు మంజూరు చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
అలాగే చంద్రబాబుపై ఉన్న పీటీ వారెంట్ అరెస్టుపై ఎటువంటి ఆదేశాలు ఇవ్వవద్దని విజయవాడ ఏసీబీ కోర్టుకు ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.