బెంగాల్లో మళ్ళీ ఎర్రజెండా?

ఒకప్పుడు ఎర్ర జెండా అంటే, ముందుగా పశ్చిమ బెంగాల్ గుర్తుకువచ్చేది. ఇంచుమించుగా పాతికేళ్లకు పైగా ఆ రాష్ట్ర  ముఖ్యమంత్రిగా  ఓ వెలుగు వెలిగిన కామ్రేడ్ జ్యోతి బసు పలచని రూపం కళ్ళ ముందుకు వచ్చేది. నిజానికి, జ్యోతి బసు బెంగాల్ కు మాత్రమే పరిమితం అయిన నాయకుడు కాదు. జాతీయ రాజకీయాల్లోనూ జ్యోతిబసు కీలక భూమిక  పోషించారు. ఒక దశలో,యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వ హయాంలో ప్రధాని పదవి జ్యోతి బసు తలుపు తట్టింది. అయితే, పార్టీ పెద్దల చారిత్రక తప్పిదం  కారణంగా చేజారి పోయింది. జ్యోతి బసు తర్వాత  ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన బుద్దదేవ్ భట్టాచార్య కొంత కాలం ఆ వారసత్వాన్ని  కొనసాగించారు. అయితే  ఇప్పడు అదంతా చరిత్ర.

 ప్రస్తుత పరిస్థితి అది కాదు. ఇంచుమించుగా మూడు దశాబ్దాలకు పైగా  ఏకచత్రాధిపత్యంగా రాష్ట్రాన్ని ఏలిన వామపక్ష కూటమికి  ఈ రోజు బెంగాల్లో ఓట్లే గానీ, సీట్లు లేవు. ఆ ఓట్ల శాతం కూడా దినదిన ప్రవర్ధమానంగా దిగజారుతోంది. ఉదాహరణకు 2024 లోక్ సభ ఎన్నికలనే తీసుకుంటే, కూటమి పెద్దన్న సిపిఎం సహా వామపక్ష కూటమి పార్టీలలో ఏ ఒక్క పార్టీకి పట్టుమని పది శాతం ఓట్లు దక్కలేదు. సిపిఎంకు కేవలం 5.67 శాతం ఓట్లు పోలయ్యాయి. పెద్దన్న పరిస్థితే ఇలా ఉంటే ఇక తమ్ముళ్ళ సంగతి చెప్పనక్కర లేదు. చిన్నన్న సిపిఐకి ఒక శాతం కంటే తక్కువ (0.22) శాతం ఓట్లు మాత్రమే పోలయ్యాయి.  

నిజానికి, 2024 ఎన్నికల్లో బెంగాల్ గడ్డపై పట్టు సాధించేందుకు  వామ పక్ష కూటమి  ముఖ్యంగా సిపిఎం చాలా గట్టి ప్రయత్నమే చేసింది. సిపిఎం అప్పటి జాతీయ ప్రధాన కార్యదర్శి స్వర్గీయ సీతారామ్ ఏచూరి సారథ్యంలో,పార్టీ పునరుజ్జీవనం లక్ష్యంగా గట్టి ప్రయత్నమే జరిగింది. వామపక్ష కూటమి కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుని ఎన్నికల బరిలో దిగింది. అయితే ఆ ఎన్నికల్లో హస్తం పార్టీకి అయినా ఒక సీటు (మాల్దా దక్షిణ్) దక్కింది కానీ, సిపిఎం సహా వామపక్ష కూటమి   పార్టీలకు సింగీల్ సీటు కూడా దక్కలేదు.

 నిజానికి  33సీట్లలో పోటీ చేసిన వామపక్ష కూటమికి, ఒక్క సీటు దక్కక  పోవడమే కాదు, ఒక్క సీటు  మినహా, మరెక్కడా రెండవ స్థానం కూడా దక్కలేదు. పూలమ్మిన చోట కట్టెలు అమ్మవలసిన దీన స్థితికి చేరుకుంది. అలాగే చాలా వరకు స్థానాల్లో లెఫ్ట్  డిపాజిట్లు కోల్పోయింది. నిజానికి, ఇప్పటికీ బెంగాల్  రాజకీయాల్లో  రెడ్ ఫ్లాగ్ కు సెల్యూట్ చేసే చేతులు చాలానే ఉన్నాయి. ఆ విధంగా ఎర్ర జెండాకు ఇంకా ఎంతో కొంత గౌరవం వుంది. అయితే  రాష్రంలో తిరుగు లేని శక్తిగా ఎదిగిన తృణమూల్ కాంగ్రెస్ ను సమర్ధవంతంగా ఎందుర్కునే జవసత్వాలను లెఫ్ట్ పార్టీలు చాల వరకు కోల్పోయాయి. అందుకే, లెఫ్ట్  కూటమిని దాటుకుని బీజేపీ ముందుకు దూసుకు వెళ్ళింది. తృణమూల్ కు ప్రధాన ప్రత్యర్ధిగా కమల దళం నిలిచింది. అంతవరకూ  ఒకటి రెండు సీట్లు, మూడు నాలుగు శాతం ఓట్లతో ఎక్కడో ఉన్న బీజేపీ 2019 లోక్ సభ ఎన్నికలలో, అనూహ్యంగా ప్రభంజనం సృష్టించింది. అంతవరకు కేవలం రెండు స్థానాలు మాత్రమే ఉన్న బీజేపే ఏకంగా 18 లోక్ సభ స్థానాలను గెలుచుకుంది.

ఓటింగ్ శాతం  అయితే, 11 శాతం నుంచి 40 శాతానికి జంప్ చేసింది. ఆ ఎన్నికల్లోనే, వామపక్ష కూటమి  సున్నా సీట్ల, శూన్య స్థాయికి చేరింది. ఆ తర్వాత 2021లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ అదే శూన్య స్థితి కొనసాగింది. మొత్తం 294 స్థనాలలో 215 స్థానాలు గెలుచుకుని తృణమూల్ కాంగ్రెస్ మూడవ సారి అధికారం దక్కించుకుంటే.. 77 స్థానాలను గెలుచుకున్న బీజేపీ రాష్ట్రంలో  తొలిసారిగా ప్రధాన ప్రతిపక్షంగా అవతరించింది. ఇక అప్పటి నుంచి లెఫ్ట్ ఖాతాలో అదే సున్నా  కంటిన్యూ అవుతోంది. తృణమూల్, బీజేపే మధ్యనే ప్రధాన పోటీ నడుస్తోంది. 
అయితే, రెండు రోజు క్రితం మధురైలో ముగిసిన సీపీఎం 24వ జాతీయ మహాసభల్లో బెంగాల్ పునరుజ్జీవన ప్రణాళికలపై సిపిఎం ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించింది. యువ రక్తంతో పార్టీని ఉరకలు వేయించాలనే లక్ష్యంతో, కేంద్ర కమిటీలో యువతకు ప్రాధాన్యత ఇచ్చారు. అందులో భాగంగా పార్టీ యువజన విభాగం డివైఎఫ్ఐ, బెంగాల్ రాష్ట్ర కార్యదర్శి  మీనాక్షి ముఖర్జీని  84 మంది సభ్యుల కేంద్ర కమిటీలోకి తీసుకున్నారు. నిజానికి  యువ రక్తం నినాదం ఇప్పుడు కొత్తగా వచ్చింది కాదు. ఐదేళ్ళ క్రితమే సీతారాం ఏచూరి ఆ ప్రయత్నం చేశారు. అయితే  2021 ఎన్నికల ఫలితాలను గమనిస్తే ఆ ప్రయత్నం ఫలించలేదనే విషయం స్పష్టమవుతుంది. ఆ ఎన్నికల్లో మీనాక్షి  కూడా పోటీ చేశారు. ఓడి పోయారు. 

అయితే.. ఆ ఎన్నికల్లో ఆమె ఇద్దరు దిగ్గజ నేతలను ఎదుర్కుని ఓడిపోయిన ప్రముఖుల జాబితాలో ప్రముఖ స్థానం సంపాదించు కున్నారు. అవును తెలంగాణలో  కామారెడ్డి అసెంబ్లీ నియోజక వర్గంలో (అప్పటి)  ముఖ్యమంత్రి కేసీఆర్, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేసులో ఉన్నఅభ్యర్ధి, పీసీసీ అధ్యక్షుడు  రేవంత్ రెడ్డి ని, బీజేపీ అభ్యర్ధి కేవీఆర్ రెడ్డి ఢీ  కొన్న విధంగా. మీనాక్షి, పశ్చిమ బెంగాల్లోని నందిగ్రామ్  నియోజకవర్గంలో ముఖ్యమత్రి మమత బెనర్జీ, బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్ధి సువేందు అధికారిని, ఢీ  కొన్నారు.అయితే, ఇక్కడ కామారెడ్డిలో లో కేవీఆర్ దిగ్గజ నేతలు ఇద్దరినీ ఓడించి గెలిచారు. అక్కడ ఆమె ఓడిపోయారు.ఆమెకు కేవలం 2.74 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి.గెలుపు ఓటములను పక్కనపెడితే, మదురై సభల్లో మార్క్సిస్టులు బెంగాల్లో మరో మారు ఎర్ర జెండాను ఎగరేయాలానే సంకల్పం అయితే గట్టిగా చెప్పుకున్నారు. అయినా మన  బాలయ్య బాబు అన్నట్లు,అన్నీ అను కున్నట్లు జరుగుతాయా ఏంటి ?