Read more!

భారాసాకు కష్టమే.. తెలంగాణలో హంగే!

ఉన్న నాలుకకు మందేస్తే కొండనాలుక ఊడిందన్నది సామెత. తెలంగాణలో బీఆర్ఎస్ పరిస్థితి అలా తయారైంది. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తరువాత జరిగిన రెండు అసెంబ్లీ ఎన్నికలలో విజయం సాధించి అధికారంలో కొనసాగిన తెరాస (ఇప్పుడు భారాస) తీవ్రమైన ప్రభుత్వ వ్యతిరేకతను మూటగట్టుకుంది. తన ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకతను గమనించిన ముఖ్యమంత్రి కేసీఆర్.. ప్రజల దృష్టిని మరల్చి.. రాష్ట్రంలో ముచ్చటగా మూడో సారి అధికారాన్ని దక్కించుకునేందుకు.. వ్యూహాత్మకంగా జాతీయ రాజకీయాలలో తెలంగాణ మోడల్ అంటూ తెరాసను భారాసగా మార్చి జాతీయ పార్టీని చేశారు. ఇతర రాష్ట్రాలలో భారాస విస్తరణ అంటూ వివిధ రాష్ట్రాలలో ప్రస్తుతం రాజకీయంగా అంతగా క్రియాశీలంగా లేని నాయకులను ప్రగతి భవన్ కు పిలిపించుకుని పార్టీ కండువా కప్పుతూ.. జాతీయ రాజకీయాలలో భారాసా ప్రభంజనం సృష్టిస్తుందంటూ తెలంగాణలో ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మరల్చే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఆ దిశగా ఆయన వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. అయితే ఆయన వ్యూహాలు ఫలించే అవకాశాలు లేవనీ తాజాగా ఉమ్మడి జిల్లాల వారీగా నిర్వహించిన ఒక సర్వే ఫలితం తేటతెల్లం చేసింది. అలాగే తెలంగాణలో అధికారమే లక్ష్యంగా దూకుడు ప్రదర్శిస్తున్న బీజేపీ కూడా తెలంగాణలో పెద్దగా ప్రభావం చూపే అవకాశాలు లేవని ఆ సర్వే ఫలితం తేటతెల్లం చేసింది. గత ఎనిమిదిన్నరేళ్లుగా అధికారంలో ఉన్న కేసీఆర్ ప్రభుత్వం యాంటీ ఇన్ కంబెన్సీని ఎదుర్కొంటుంటే.. గత తొమ్మిదేళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ సర్కార్ పై కూడా తెలంగాణలో తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది.

ఎంతగా ప్రయత్నం చేసినా బీజేపీ ప్రభావం రాష్ట్రంలోని ఒక్క జిల్లాకే పరిమితమైందని సర్వే వెల్లడించింది.  ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే రాష్ట్రంలో హంగ్ తప్పదన్న సంకేతాలు ఇస్తోంది. అయితే ఇటీవలి కాలంలో రాష్ట్రంలో ఏ ఎన్నిక జరిగినా పరాజయాన్ని మూటగట్టుకుంటున్న కాంగ్రెస్ గణనీయంగా పుంజుకుని మ్యాజిక్ ఫిగర్ కు చేరువయ్యే అవకాశాలున్నాయని కూడా ఆ సర్వే పేర్కొంది. 
రాష్ట్రంలో  వచ్చే ఎన్నికలలో అధికారం చేపట్టబోయేది మేమే అని ధీమాగా చెబుతున్న బీజేపీ మూడో స్థానానికే పరిమితమౌతుందని సర్వే ఫలితం చెబుతోంది.   రాష్ట్రంలో కాంగ్రెస్ ను బలహీనపరిచేందుకు కేసీఆర్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదనీ, ప్రజలలో కాంగ్రెస్ పట్ల సానుకూల వ్యక్తమౌతున్నదనీ సర్వే ఫలితం పేర్కొంది.   

 ఉమ్మడి జిల్లాల వారీగా జరిగిన ఈ  సర్వే రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఆ సర్వే ప్రకారం  ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే రాష్ట్రంలో అతి పెద్ద పార్టీ గా కాంగ్రెస్ అవతరిస్తుందనీ,  అధికార భారాసా రెండవ స్థానానికే పరిమితమౌతుందనీ, ఇక బీజేపీ మూడో స్థానంతో సరిపెట్టుకోవలసిందేననీ ఆ సర్వే పేర్కొంది.  ఉమ్మడి జిల్లాల వారిగా సర్వే వెల్లడించిన దానిని బట్టి ఆరు రాష్ట్రాలలో కాంగ్రెస్ కు స్పష్టమైన ఆధిక్యత కనిపించింది.

ఇక మూడు జిల్లాలో బారసా కు కొద్ది పాటి మొగ్గు కనిపించగా, కేవలం హైదరాబాద్ జిల్లాలో మాత్రమేబీజేపీ కి కొంత సానుకూలత కనిపించింది.  హంగ్ అనివార్యమైన పరిస్థితులున్నప్పటికీ.. మ్యాజిక్ ఫిగర్ కు కాంగ్రెస్ చేరువగా వస్తుందనీ, ఎన్నికల నాటికి ఇదే ట్రెండ్ కొనసాగితే మ్యాజిక్ ఫిగర్ ను అధిగమించి అధికారంలోకి వచ్చినా ఆశ్చర్యపోవలసిన అవసరం లేదని సర్వే ఫలితం చెబుతోంది.