ట్రంప్ ...ఇండియా రావడానికి అసలు కారణమిదే?
posted on Feb 25, 2020 @ 10:34AM
ట్రంప్ ఇండియా పర్యటన తరువాత అమెరికా, భారత్ సంబంధాలు ఎలా మారుతాయన్నదే ఇప్పుడు కీలకంగా మారింది. అయితే, అంతకంటే ముఖ్యమైన అంశం మరొకటి వినిపిస్తోంది. ముఖ్యంగా అమెరికా అధ్యక్ష ఎన్నికలను భారత్ ప్రభావితం చేయడమే ఇప్పుడు ఆసక్తి రేపుతోంది. ఒక దేశపు ఎన్నికలను మరో దేశం ప్రభావితం చేయడం కాస్తంత ఆశ్చర్యం కలిగించే అంశమే. ఇరుగు పొరుగు దేశాల్లో కొంతమేరకు అలాంటి ప్రభావం ఉండే అవకాశం ఉంది. ఎక్కడో సుదూరంగా ఉన్న అమెరికాలో అక్కడి ఎన్నికలను భారతీయులు ప్రభావితం చేయగలగడమే ఇప్పుడు కీలకంగా మారింది. అదే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారత్ వచ్చేలా చేసింది.
ఎనిమిది వేల మైళ్ల దూరం...18 గంటల ప్రయాణం...అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రెక్కలు కట్టుకొని భారత్ లో వాలేందుకు ఓ ముఖ్య కారణమే ఉంది. అమెరికాలో మరో ఎనిమిది నెలల్లో అధ్యక్ష ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో అమెరికాలోని ప్రతీ రాష్ట్రం కూడా కీలకమే. నేడు అమెరికాలో పలు రాష్ట్రాల్లో భారతీయులు ఉన్నారు. వారిలో గుజరాతీలే అధికం. అలా ఎన్నారైలపై....హౌడీ మోడీ స్ఫూర్తితో ట్రంప్ విసిరిన వల గుజరాత్ లో నమస్తే ట్రంప్ గా మారిపోయింది. అమెరికాలో ఐదు నెలల క్రితం జరిగిన హౌడీ మోడీ కార్యక్రమం ట్రంప్ లో ఒక విధమైన ఆసక్తిని రేకెత్తించింది. ఆ కార్యక్రమానికి హాజరైన భారతీయులను....మరీ ముఖ్యంగా గుజరాతీలను చూస్తే....వారి ఓట్లను క్యాష్ చేసుకోవాలన్న ఆలోచన కలిగినట్లుంది. బహుశా ఆ ఆలోచనలో నుంచే ట్రంప్ భారత్ పర్యటన పుట్టుకొచ్చింది.
అయితే, అమెరికా అధ్యక్షుడు చేసే పర్యటనపై ఎన్నికల్లో ఓట్ల కోసమే భారత్ పర్యటన అన్న ముద్ర పడకూడదు. అదే సమయంలో ఆయన తన పర్యటనకు తగినట్లుగా అమెరికా లబ్ధి పొందాలి. అందుకే వాణిజ్య ఒప్పందాలను తెరపైకి తీసుకువచ్చారు. కాకపోతే భారత్ వాటిని తీవ్రంగా వ్యతిరేకించింది. దాంతో అమెరికా రక్షణ ఒప్పందాలను తెరపైకి తీసుకువచ్చింది. భారత్ కూడా అందుకు అంగీకరించింది. ఇలా రెండు దేశాల మధ్య ఉభయతారకంగా ఉండేలా ఒప్పందాలు కుదిరాయి. ట్రంప్ తో పాటుగా ఆయన కుటుంబసభ్యులు కూడా ఈ పర్యటనలో పాల్గొనడం మోడీ గౌరవాన్ని మరింత పెంచింది.