ఎక్కడ చూసినా ఫర్ సేల్ బోర్డులే! హైదరాబాద్ లో రియల్ ఢమాలేనా?
posted on Nov 6, 2020 @ 2:25PM
వర్క్ ఫ్రం హోంతో అఫీస్ స్పేస్ కు డిమాండ్ బాగా తగ్గిందా? భవంతుల ముందు ఇకపై ఫర్ సేల్ బోర్డులే కనిపిస్తాయా? కరోనా దెబ్బ నుంచి రియల్ రంగం ఇప్పట్లో కోలుకోవడం కష్టమేనా?. హైదరాబాద్ లో భాగా డిమాండున్న ఏరియాల్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితిని చూస్తే ఇదే అనుమానం వస్తోంది. మహానగరంలో రియల్ ఎస్టేట్ రంగం ఢమాల్ అయినట్లు కనిపిస్తోంది. కరోనా మహమ్మారి దెబ్బకు అన్ని రంగాలు కుదేలయ్యాయి. రియల్ ఎస్టేట్ రంగమైతే తీవ్ర సంక్షోభంలో పడింది. కరోనాతో ఉద్యోగాలు కోల్పోవడం, నిధుల కొరత, కూలీల కొరత.. ఇలా అన్నింటా ప్రతికూల పరిస్థితులే ఉండటంతో గతంలో మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగిన రియల్ దందా.. ఇప్పుడు మూడు టూలెట్ బోర్డులు... ఆరు ఫర్ సేల్ బోర్డులుగా తయారైందని చెబుతున్నారు.
కరోనా భయంతో ఐటీ, బీపీవో కంపెనీలన్ని తమ ఉద్యోగులతో వర్క్ ఫ్రం హోం చేయిస్తున్నాయి. ఉద్యోగుల ఆరోగ్యం, భద్రత తమకు తొలి ప్రాధాన్యమని చెబుతున్నాయి. దీంతో హైదరాబాద్ లోని మెజార్టీ ఐటీ, బీపీవో కంపెనీలు వర్క్ ఫ్రం హోం అమలు చేస్తున్నాయి. ఇప్పటికే ఆరు నెలలు కావడం, కరోనా భయం ఇంకా ఉండటంతో కంపెనీలన్ని అదే విధానాన్ని కొనసాగిస్తున్నాయి. దీంతో కొన్ని చిన్న కంపెనీల యాజమాన్యాలు ఇప్పటివరకు నడిపించిన ఆఫీసులను మూసి వేస్తున్నాయి. గతంలో పెద్దపెద్ద భవంతుల్లో అద్దాల మేడల్లాంటి కార్యాలయాలు ఏర్పాటు చేసుకున్న సంస్థలు.. ఇప్పుడు చిన్న భవంతులు తీసుకుంటున్నాయి. ఎక్కువ మంది ఉద్యోగులు వర్క్ ఫ్రం హోం చేస్తుండటంతో ఉన్న కొ్ది మంది ఉద్యోగుల కోసం రెండు, మూడు రూముల్లో అఫీస్ ను కొనసాగిస్తున్నాయి. కొన్ని కంపెనీలు మొత్తంగానే మూతపడ్డాయి. కొన్ని రోజులుగా హైదరాబాద్ లో రోజూ ఏదో ఒక కంపెనీ క్లోజ్ అవుతూనే ఉంది.
కరోనాతో మారిన అఫీస్ కల్చర్ తో హైదరాబాద్ లో కొత్త సీన్ కనిపిస్తోంది. కమర్షియల్ స్పేస్ కు ఎప్పుడూ ఫుల్ డిమాండ్ ఉండే ఫైనాన్షియల్ డిస్ట్రిక్, గచ్చిబౌలి, మాదాపూర్, కొండాపూర్, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో కమర్షియల్ స్పేస్ అంతా ఖాళీగా మారుతోంది. ఇప్పటికే వందలాది భవనాల ముందు టులెట్ బోర్డులు కనిపిస్తున్నాయి. ప్రధాన కూడళ్లు, మెయిస్ సెంటర్లలోనూ ఇదే పరిస్థితి ఉంది. కొన్ని ప్రాంతాల్లో అయితే టులెట్ బోర్డు పెట్టినా ఎవరూ రాకపోతుండటంతో ఏకంగా అమ్మెందుకు సిద్ధమవుతున్నారు భవనాల యజమానులు. దీంతో సిటీలో రోజురోజుకు ఫర్ సేల్ బోర్డులు పెరిగిపోతున్నాయి. గతంలో ఆఫీస్ స్పేస్ కోసం ఎంతగా ప్రయత్నించినా మాదాపూర్ ఏరియాలో దొరికేది కాదని.. ఇప్పుడు ఎక్కడ చూసినా టులెట్ బోర్డులో ఉన్నాయని ఐటీ ఉద్యోగులు, వ్యాపారులు చెబుతున్నారు.
దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నప్పటికీ, కరోనా రెండోసారి విజృంభిస్తుందనే ఆందోళనల నేపథ్యంలో ఇంటి నుండి పనిని పొడిగిస్తున్నాయి. తాజాగా కేంద్రం కూడా వర్క్ ఫ్రమ్ హోం విధానానికి ఊతమిచ్చేలా పలు సంస్కరణలు చేపట్టింది. ఐటీ, బీపీవో కంపెనీలకు పలు సడలింపులు ఇచ్చింది. దీంతో ఇకపై వర్క్ ఫ్రం హోం ఎక్కువగా అమలు కావొచ్చని అంచనా వేస్తున్నారు. వర్క్ కల్చర్‌లో మార్పు కరోనా కారణంగా పనితీరు పూర్తిగా మారిపోయిందని, భవిష్యత్తులో ఉద్యోగులందరూ కూడా కార్యాలయానికి వచ్చి పని చేయాల్సిన అవసరం ఉండకపోవచ్చని దిగ్గజ ఐటీ కంపెనీల ప్రతినిధులు కూడా చెబుతున్నారు.
కమర్షియల్ స్పేస్ లోనే కాదు గృహనిర్మాణ రంగం తీవ్ర ఆటుపోట్లను ఎదుర్కొంటోంది. కరోనా దెబ్బకు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ దాదాపు పదేళ్లు వెనక్కు వెళ్లిందని చెబుతున్నారు. అన్ని చోట్ల డిమాండ్ బాగా పడిపోయిందని లెక్కలు చెబుతున్నాయి. గతేడాది మొదటి ఆరు నెలల్లో 8వేల334 యూనిట్లు అమ్ముడుపోతే.. ఈ ఏడాది అదే సమయానికి 43శాతం అమ్మకాలు పడిపోయాయి.అంటే దాదాపు సగానికి సగం అన్నమాట. కేవలం 4వేల782 యూనిట్లే విక్రయాలు జరిగాయి. మాదాపూర్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్, గచ్చిబౌలి, కొండాపూర్ తదితర ప్రాంతాల్లో అఫీస్ స్పేస్ తో ఇండ్లకు డిమాండ్ భారీగా పడిపోయింది.
కరోనాకు ముందు వరకు హైదరాబాద్ లో రెసిడెన్షియల్ గేటెడ్ కమ్యూనిటీలో చదరపు అడుగుకు ఏకంగా రూ.3వేల నుంచి అత్యధికంగా గచ్చిబౌలిలో రూ.7వేల ధర పలికింది. డబుల్ బెడ్ రూం కు కనీసం రూ.75 లక్షల నుంచి రూ.1కోటి వరకు వెచ్చించాల్సిన పరిస్థితి ఉండేది. దీంతో మధ్యతరగతి జనాలు అపార్ట్ మెంట్ ఆశలను వదిలేసుకునేవారు. ఇప్పుడు కరోనా ప్రభావంతో రియల్ వ్యాపారులు బిల్డర్లు నిలువునా మునిగిపోయారు. ఇప్పుడు బతకడానికే జనాలు ప్రాధాన్యం ఇస్తున్నారు. అద్దెకు ఉండడమే ఈ టైంలో మేలని భావిస్తున్నారు. దీంతో బిల్డర్లు రియల్ వ్యాపారులు కూడా ధరలను భారీగా తగ్గించేస్తున్నారు. తక్కువ ధరకే ఇప్పుడు హైదరాబాద్ లో అపార్ట్ మెంట్లు లభిస్తున్నాయి. అలా అయినా రియల్ రంగాన్ని బతికించడానికి సిద్దమయ్యారు. ధరలు తగ్గించకపోతే రియల్ రంగం కుప్పకూలడం ఖాయమని.. ఢిల్లీలోలాగానే ఇక్కడే రియల్ ఢమాల్ అంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
కరోనా మహమ్మారి నేపథ్యంలో స్థిరాస్తి రంగం కష్టాల్లో కూరుకుపోయిందని, నగదు కొరత ఏర్పడి ప్రాజెక్టులు మధ్యలో నిలిచిపోయాయని క్రెడాయ్ ఆందోళన వ్యక్తం చేసింది. నగదు కొరత వల్ల నిలిచిపోయిన ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు ప్రభుత్వం నుండి ఆర్థికంగా ప్రోత్సాహకం అవసరమని తెలిపింది. రియల్టీ రంగానికి మారటోరియం కాలాన్ని 31 మార్చి 2021 వరకు పొడిగించాలని క్రెడాయ్ కోరుతోంది. ప్రభుత్వం నుండి ఆర్థిక సాయం అందకుంటే ఉద్యోగాలు మరిన్ని కోల్పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. తీవ్ర సంక్షోభంలో.. రియాల్టీ రంగానికి ఆర్థిక సాయానికి సంబంధించి ఆలస్యం చేయవద్దని ఈ రంగం నిపుణులు కోరుతున్నారు. నిధుల లేమి సహా వివిధ సమస్యలతో తీవ్ర సంక్షోభం ఉన్న రియాల్టీ రంగానికి కొంత సహకారం అవసరమని చెబుతున్నారు.గతంలో దేశ రాజధాని ఢిల్లీలో రియల్ ఎస్టేట్ రంగం ఉవ్వెత్తున ఎగిసి ఒక్కసారిగా కుప్పకూలింది. ఇప్పుడు హైదరాబాద్ లోనూ అలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు రియల్ ఎస్టేట్ వ్యాపారులు.