చంద్రబాబుపైనే రాయపాటి విమర్శలు.. దొబ్బేయమన్నారు..
posted on Jan 15, 2016 @ 2:07PM
ఈ మధ్య రాయపాటి సాంబశివరావు ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. ఈమధ్య రైల్వే జోన్ విషయంలో.. మళ్లీ సీపీఐ విషయంలో ఇప్పుడు ఊహించని రీతిలో టీడీపీ అధినేత చంద్రబాబు మీదే సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లోకి వచ్చారు. రాయపాటి గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం పెదగొట్టిపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల స్వర్ణోత్సవ సంబరాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగ ఆయన మాట్లాడుతూ పల్నాడులోని మాచర్ల.. వినుకొండ.. గురజాల గ్రామాల నీటి సమస్యను తీర్చేందుకు వీలుగా రూ.1120కోట్లతో వాటర్ గ్రిడ్ ఏర్పాటుకోసం ముఖ్యమంత్రి చంద్రబాబు దగ్గరకు వెళితే నిధులు లేవన్నారన్నారు అని వ్యాఖ్యానించారు. అంతేకాదు కేంద్రం గురించి కూడా మాట్లాడుతూ ఆయన.. కేంద్రంతో గట్టిగా మాట్లాడితే దొబ్బేస్తున్నారంటూ వ్యాఖ్యానించి అందరిని ఆశ్చర్యపరిచారు.
అక్కడితో ఆగకుండా ఇంకా చంద్రబాబు పై పలు ఆరోపణలు చేశారు. బ్యాంకు రుణాల కోసం ప్రయత్నిస్తే.. బ్యాంకోళ్లు 9.6శాతం వడ్డీకి అప్పు ఇస్తామంటే.. చంద్రబాబు మాత్రం 8.5శాతం అయితేనే ఓకే అంటున్నారని..గుంటూరు రైల్వే జోన్ కోసం ఒత్తిడి చేద్దామంటే కోప్పడుతున్నారని.. సీపీఐ నేతలకు భోజనాలు పెడితే.. ఎందుకు పెట్టావని చంద్రబాబు ప్రశ్నించారని.. తాను పార్టీలో ఇమడలేకపోతున్నానని.. తనను అడవుల్లోకి (పల్నాడు) తీసుకొచ్చి పడేశారని ఆరోపించారు. అయితే ఇంతా చెప్పిన రాయపాటి లాస్ట్ లో ఇదంతా ఆఫ్ ద రికార్డ్ అంటూ చెప్పడం కొసమెరుపు. మరి చెప్పాల్సిందంతా ఓపెన్ గా చెప్పేసి ఇప్పుడు ఆఫ్ ద రికార్డ్ అంటూ రాయపాటి చెప్పిన విషయమంతా బయటకు వచ్చేసింది. మరి రాయపాటి వ్యాఖ్యలకు చంద్రబాబు ఎలా స్పందిస్తారో చూడాలి.