కర్నూలుకు హైకోర్టు తరలింపు ఎందాక వచ్చిందంటే.. కేంద్రం రిప్లై ఇదే..
posted on Feb 4, 2021 @ 12:06PM
ఏపీలో జగన్ సర్కార్ అధికర్మలోకి వచ్చిన తర్వాత మూడు రాజధానుల ప్రతిపాదన తెచ్చి అసెంబ్లీలో బిల్లు కూడా పాస్ చేయించుకున్న సంగతి తెల్సిందే. దీని ప్రకారం విశాఖను ఎగ్జిక్యూటివ్ కేపిటల్ గాను కర్నూల్ ను న్యాయ రాజధానిగా చేస్తూ హైకోర్టును అక్కడికి తరలించాలని నిర్ణయిస్తూ కేంద్రానికి ప్రతిపాదనలు పంపారు. అంతేకాకుండా సీఎం జగన్ ఢిల్లీ పర్యటనలలో అటు కేంద్ర మంత్రి అమిత్ షా ను, ఇటు ప్రధాని మోడీని కలిసి ఈ విషయంలో సహకరించాలని కోరుతూనే ఉన్నారు.
తాజాగా ఇదే అంశాన్ని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు రాజ్యసభలో ఈరోజు ప్రస్తావించారు.ఏపీ హైకోర్టు తరలింపు ప్రతిపాదన ప్రస్తుతం ఏమైనా ఉందా…? ఒకవేళ ఉంటే అది ఎక్కడి వరకు వచ్చింది…? అని అయన అడిగారు. దీనిపై న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ స్పందిస్తూ.. గతేడాది ఫిబ్రవరిలో హైకోర్టును కర్నూలుకు తరలించేందుకు సీఎం జగన్ ప్రతిపాదన చేసారని, అయితే హైకోర్టు పరిపాలన బాధ్యతలన్నీ ప్రధాన న్యాయమూర్తి పరిధిలో ఉంటాయని అయన తెలిపారు. హైకోర్టుతో పాటు ఏపీ ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపిన తర్వాతే ఏపీ హైకోర్టు తరలింపు విషయమై ఒక నిర్ణయం తీసుకొంటామని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ ప్రకటించారు.
హైకోర్టు పరిపాలన బాధ్యతలు ప్రధాన న్యాయమూర్తి పరిధిలో ఉంటాయని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ విషయంలో ఏపీ ప్రభుత్వం, హైకోర్టు ఏకాభిప్రాయానికి రావాల్సిన అవసరం ఉందన్నారు. హైకోర్టు తరలింపు వ్యవహారం ప్రస్తుతం న్యాయస్థానాల పరిధిలోనిదని కేంద్ర మంత్రి చెప్పారు. హైకోర్టు తరలింపు కోసం ఎలాంటి గడువు లేదని అయన స్పష్టం చేసారు. మరోపక్క మూడు రాజధానుల అంశాన్ని విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.