రత్తయ్యతో రాయపాటికి కన్నా చెక్ పెడతారా
posted on Jun 22, 2013 @ 2:38PM
గ్రూపు రాజకీయాలకి, కుమ్ములాటలకి పెట్టింది పేరయిన కాంగ్రెస్ పార్టీలో ఏ పరిణామం జరిగినా దాని వెనుక ఏదో ఒక పెద్ద కధే ఉంటుంది. గుంటూరు జిల్లా వైకాపాకు చెందిన ప్రముఖ నేత రత్తయ్యని, అదే జిల్లాకు చెందిన మంత్రి కన్నా లక్ష్మీనారాయణ మెల్లగా కాంగ్రెస్ పార్టీలోకి రప్పించగలుగారు. నిన్నఆయనను స్వయంగా వెంటబెట్టుకొని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణల సమక్షంలో పార్టీ తీర్ధం ఇప్పించి కాంగ్రెస్ కండువా కప్పించారు.
ఆయన రాకతో కాంగ్రెస్ పార్టీ బలపడటం సంగతి ఎలావున్నపటికీ, గుంటూరు జిల్లాలో రాయపాటి సాంభశివరావుతో పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే వైరం ఉన్న కన్నా లక్ష్మినారాయణ, ఆయన ధాటికి తాళలేకపోవడంతో తన వర్గం మరింత బలపడితే తప్ప ఆయనను ఎదుర్కోవడం కష్టమని భావించిన కన్నా లక్ష్మినారాయణ, వైకాపాలో ఇమడలేక ఇబ్బందిపడుతున్నరత్తయ్యని మెల్లగా పార్టీలోకి రాప్పించగలిగారు. ఇంతవరకు రాయపాటిదే పైచేయిగా సాగుతున్న గుంటూరు రాజకీయాలలో రత్తయ్యతో కలిసి కనా చక్రం తిప్పాలని భావిస్తున్నారు. అంతే గాక, వచ్చే ఎన్నికలలో రత్తయ్యకి గుంటూరు యంపీ టికెట్ ఇప్పించి రాయపాటి ప్రాభవానికి గండి కొట్టాలనే దూరాలోచన చేస్తున్నట్లు సమాచారం. మరి దీనికి రాయపాటి ఏవిధంగా కౌంటర్ ఇస్తారో చూడాలి. వీటినే కాంగ్రెస్-మార్క్ రాజకీయలంటారు.