మాజీ ఉద్యోగి ఇంటికెళ్లి ఆరోగ్య పరిస్థితిపై ఆరా! రతన్ టాటాపై ప్రశంసల వరద
posted on Jan 6, 2021 @ 11:27AM
ఆయన దేశంలోనే ఒక బడా వ్యాపార వేత్త. సంపదను సృష్టించడంలో ఆయనకు ఆయనే సాటి.. అయితే మానవత్వాన్ని చాటుకోవడంలోనూ ఆయనకు ఎవరూ సాటిలేరని నిరూపించారు. అతనే టాటా గ్రూప్ సంస్థల చైర్మన్ రతన్ టాటా. పరిచయం అక్కర్లేని పేరది. దేశంలో అత్యంత సంపన్నులలో ఒకరైన రతన్ టాటాకు వ్యాపార రంగంలో మిత్రులే తప్ప శత్రువులు లేరంటే ఆయన హుందాతనం, వ్యక్తిత్వం ఏంటన్నది చెప్పవచ్చు. రతన్ టాటా మరోసారి తన మానవత్వం చాటుకున్నారు.
టాటా కంపెనీలో పనిచేసిన మాజీ ఉద్యోగి అనారోగ్యం గురించి తెలుసుకున్న రతన్ టాటా ఆయన ఇంటికి వెళ్లారు. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
గతంలో యోగేష్ దేశాయ్ అనే వ్యక్తి టాటా కంపెనీలో ఉద్యోగం చేశారు. కానీ అనారోగ్య కారణంగా జాబ్ కు రిజైన్ చేసి ఇంట్లోనే ఉంటున్నారు. అయితే ఉద్యోగి యోగేశ్ దేశాయ్ ఆరోగ్యం గురించి తెలుసుకున్న రతన్ టాటా మానవత్వం చాటుకున్నారు. ముంబై నుంచి పూణేలోని ఫ్రెండ్స్ సొసైటీలో నివాసం ఉంటున్న ఉద్యోగి ఇంటికి స్వయంగా వెళ్లారు. యోగేష్ నీ ఆరోగ్యం ఎలా ఉందని పరామర్శించారు. కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఇందుకోసం ఎలాంటి ఆర్భాటాలు లేకుండా ముంబై నుంచి పుణె వెళ్లారు రతన్ టాటా.
యోగేశ్ దేశాయ్ తన లింక్డ్ ఇన్ ఖాతాలో టాటా పర్యటన గురించిన వివరాలు పంచుకున్నారు. ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించి ఫొటోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. తమ కంపెనీలో పనిచేసిన ఓ ఉద్యోగి పట్ల రతన్ చూపించిన ఔన్నత్యాన్ని అందరు మెచ్చుకుంటున్నారు. తమ ఉద్యోగులు ఏమైపోతే మాకేంటి అని అనుకుంటోన్న ఇలాంటి రోజుల్లో మాజీ ఉద్యోగి పట్ల ఇంత మార్యాదతో ఉండడం గొప్ప విషయమని నెటిజన్లు రతన్ టాటాను ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ఆయన దగ్గరి నుంచి బిజినెస్‌మెన్లు, ఎంట్రప్రెన్యూర్లు చాలా నేర్చుకోవాలని అభిప్రాయపడుతున్నారు. ఉద్యోగి పట్ల ఆయన కమిట్‌మెంట్ చూసి అందరూ ఫిదా అవుతున్నారు.
రతన్ టాటా గతంలోనూ అనేక సందర్భాల్లో ఇలా పెద్ద మనసు చాటుకున్నారు. ముంబైపై ఉగ్రదాడులు జరిగిన వేళ, తన సంస్థల్లో పనిచేస్తూ బాధితులుగా మారిన 80 మంది ఉద్యోగుల కుటుంబాలను కలిసిన ఆయన, వారి పిల్లల చదువులకు అవసరమైన సాయం చేశారు