హరికృష్ణకు ఆ అవకాశం దక్కేనా..?
posted on Dec 7, 2015 @ 11:50AM
వచ్చే ఏడాది 2016 జూన్ నాటికి నాలుగు రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్బంగా రాజ్యసభ సభ్యులుగా ఉన్న సుజనా చౌదరి, నిర్మలా సీతారామన్, జైరాం రమేశ్, జేడీ శీలంల పదవికాలం పూర్తికానుంది. ఈనేపథ్యంలో ఈ నాలుగు సీట్లు ఎవరికి దక్కుతాయనే అంశంపై ఇప్పుడు ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. అయితే ఈ స్థానాల్లో సుజనా చౌదరికి.. నిర్మలా రామన్ కు మళ్లీ అవకాశం లభించనున్నట్టు తెలస్తోంది. వీరిద్దరికి మళ్లీ సీట్లు ఖరారు అయ్యే ఛాన్స్ ఉందని పార్టీ పెద్దలు అనుకుంటున్నారు. ఇక ఏపీ శాసనసభలో కాంగ్రెస్‌కు ప్రాతినిథ్యం లేకపోవడంతో ఆ పార్టీ నుంచి ఎన్నికైన జైరాం రమేష్, జేడీ శీలంకు ఛాన్స్ లేదు. దీంతో ఉన్న నాలుగు స్థానాల్లో మూడు స్థానాలు బీజేపీ -టీడీపీ పార్టీలు దక్కించుకునే అవకాశం ఉంది. ఇక మిగిలింది ఒక్క సీటు. దీనిని వైసీపీ గెలుచుకనే అవకాశం ఉంది. కాగా మూడు స్థానాల్లో ఒకటి సుజానాకు.. ఇంకోటి నిర్మలా రామన్ కు ఉండగా ఇక మిగిలింది ఒక్క స్థానం.. ఈ స్థానానికి గాను నందమూరి హరికృష్ణ పోటీ పడుతున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే తనకు మరోసారి రాజ్యసభ సీటు ఇవ్వాలని.. చంద్రబాబు నాయుడితో చర్చించినట్టు రాజకీయ వర్గాలు అనుకుంటున్నాయి. చంద్రబాబు మాత్రం దానికి సానుకూలంగా స్పందించలేదని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే నారా లోకేష్ పార్టీ జాతీయ కార్యదర్శిగా ఉన్న నేపథ్యంలో ఈసారి రాజ్యసభ అభ్యర్ధుల ఎంపిక ఆయన చేతుల్లోనే ఉంది.. మరి లోకేశ్ హరికృష్ణకు ఆ అవకాశం ఇస్తారో లేదో చూడాలి.