సన్ రైజర్స్ హైదరాబాద్ పై రాజస్థాన్ రాయల్స్ ఘన విజయం
posted on Apr 2, 2023 @ 4:52PM
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16వ సీజన్ ను సన్ రైజర్స్ హైదరాబాద్ ఘోర పరాజయంతో మొదలెట్టింది. సొంత గడ్డపై రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో హైదరాబాద్ ఏకంగా 72 పరుగుల తేడాతో ఓటమి మూటగట్టుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 203 పరుగులు చేసింది.
రాజస్తాన్ జట్టుకు బట్లర్, జైస్వాల్ శుభారంభం అందించారు. ముఖ్యంగా బట్లర్ బౌండరీల వర్షం కురిపించాడు. కేవలం 20 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మరో ఎండ్ లో ఉన్న జైస్వాల్ కూడా బట్లర్ తో పోటీ పడి మరీ పరుగులు సాధించారు. దాంతో పవర్ ప్లేలోనే రాజస్తాన్ రాయల్స్ 85 పరుగులు సాధించింది. బట్లర్ ఔటైన తరువాత క్రీజ్ లోకి వచ్చిన స్కిప్పర్ సంజూ సామ్సన్ కూడా ధాటిగా ఆడాడు.
అయితే తరువాత హైదరాబాద్ బౌలర్లు పుంజుకోవడంతో ఒక దశలో రాజస్థాన్ స్కోరు 250 దాటుతుందేమో అనిపించినా చివరకు 203 పరుగులకు పరిమితమైంది. 204 భారీ లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన సన్ రైజర్స్ హైదరాబాద్ ఏ దశలోనూ లక్ష్య ఛేదన దిశగా సాగలేదు. తొలి ఓవర్ లోనే రెండు వికెట్లు కోల్పోయిన హైదరాబాద్ ఆ తరువాత కూడా క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోతూనే వచ్చింది. చివరకు 20 ఓవర్లలో 8 వికెట్లకు 131 పరుగులు చేసి 72 పరుగుల తేడాతో పరాజయం పాలయ్యింది.