రాజపక్సే తిరుపతి పర్యటన: టెన్షన్ టెన్షన్
posted on Feb 8, 2013 @ 10:33AM
తిరుపతిలో శ్రీలంక అధ్యక్షుడు మహింద్ర రాజపక్సే తిరుమల పర్యటనకు నిరసనగా వాల్ పోస్టర్లు, కరపత్రాలు వెలిశాయి. ఆయన పర్యటనకు వ్యతిరేకంగా తమిళ పార్టీలు నిరసన తెలిపేందుకు పోలీసులను అనుమతి కోరాయి. ఇంటెలిజెన్స్ హెచ్చరికల నేపథ్యంలో పోలీసులు తిరుపతిలో 144 సెక్షన్ విధించారు. రాజపక్సేను అడ్డుకుంటామని తమిళ ప్రజాసంఘాలు, పీఎంకే నేత వైగో హెచ్చరికలతో తిరుపతి, తిరుమలలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
మరోవైపు రాజపక్సే తమిళ ద్రోహి అని, ఆయన పర్యటనను అడ్డుకుంటామంటూ తమిళవాసులు భారీగా తిరుమలకు చేరుకుంటున్నారు. దాంతో రాజపక్సే తిరుమల పర్యటన ఉత్కంఠకు గురి చేస్తోంది. ఆయన పర్యటన ఈ రోజు ఉదయం నుండే ఉండాల్సి ఉంది. అయితే ఈ సాయంత్రానికి వాయిదా పడింది.
హెచ్చరికల నేపథ్యంలో తిరుమలకు వచ్చే అన్ని వాహనాలను పోలీసులు తనిఖీ చేస్తున్నారు. ఇప్పటికే తిరుపతిలో భారీగా తమిళనాడుకు చెందిన పార్టీల కార్యకర్తల వాహనాలు భారీగా కనిపిస్తున్నాయి. రాజపక్సే తనతో పాటు 60 మంది కుటుంబ సభ్యులు, ఇతర బంధువులతో ప్రత్యేక విమానంలో తిరుమలకు రానున్నారు.