రాజకీయ పార్టీ పెట్టడం లేదన్న రజనీకాంత్! క్షమించాలని అభిమానులకు విన్నపం
posted on Dec 29, 2020 @ 11:21AM
అనారోగ్యానికి గురైన తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాజకీయ పార్టీ ఏర్పాటుపై తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీ ప్రారంభిచలేనంటూ మూడు పేజీల సుదీర్ఘ లేఖను ట్విట్టర్ వేదికగా విడుదల చేశారు రజనీ కాంత్. అనారోగ్య కారణాల కారణంగా రాజకీయాల్లోకి రావడం లేదని ఆయన అందులో వివరించారు. రాజకీయ పార్టీపై తానిచ్చిన మాటను వెనక్కి తీసుకోవడంపై తనను క్షమించాలంటూ అభిమానులను కోరారు . రాజకీయ ప్రకటనకు ముందు ఆసుపత్రిలో తాను చేరడమనేది దేవుడి హెచ్చరికగా భావిస్తున్నట్టు లేఖలో తెలిపారు రజనీకాంత్.
2017 డిసెంబర్ 31న రాజకీయ పార్టీపై ప్రకటన చేశారు రజనీకాంత్. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తామని కూడా ప్రకటించారు. అయితే పార్టీ పెడతానని ప్రకటించి మూడేళ్లు అయినా... పార్టీ ఏర్పాటుపై పురోగతి కన్పించలేదు. రజనీ మక్కల్ మండ్రం ఏర్పాటు, కార్యవర్గం నియామకం, సభ్యత్వ నమోదుతో సరిపెట్టారు రజనీకాంత్. మరో ఐదు నెలల్లోనే అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో రజనీకాంత్ పార్టీ ఉండకపోవచ్చని దాదాపుగా అందరూ నిర్ణయానికి వచ్చారు. ఇంతలో సడెన్ గా మేల్కొన్న రజనీకాంత్.. నవంబర్ 30న రజనీ మక్కల్ మండ్రం సభ్యులతో చర్చించి కొత్త పార్టీపై మరోసారి ప్రకటన చేశారు. డిసెంబర్ 31 పార్టీ పేరు ప్రకటిస్తానని చెప్పారు. పార్టీ పేరు రిజిస్ట్రేషన్ ప్రక్రియను అయన అనుచరులు కేంద్ర ఎన్నికల సంఘం పూర్తి చేశారు. ఇంతలోనే రజనీకాంత్ ఆరోగ్యం క్షీణించి హాస్పిటల్ లో చేరారు. ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా రెస్ట్ తీసుకోవాలని వైద్యులు సూచించారు. దీంతో రాజకీయ పార్టీ ప్రకటన ఉండబోదని క్లారిటీ ఇచ్చారు రజనీ కాంత్. రాజకీయ పార్టీ ఉండబోదన్న రజనీకాంత్ ప్రకటనతో ఆయన అభిమానులు నిరాశలో మునిగిపోయారు.