వైసీపీ నుంచి విడదల రజనీ ఔట్?
posted on Dec 2, 2025 @ 1:13PM
మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నాయకురాలు విడదల రజనీ జగన్ కు ఝలక్ ఇవ్వనున్నారా? వైసీపీని వీడుతానంటూ పార్టీ అధినేతకు లీకులు పంపిస్తున్నారా? అంటే వైసీపీ వర్గాలు ఔననే అంటున్నాయి. తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయ అరంగేట్రం చేసిన విడదల రజినీ.. అప్పట్లో తాను చంద్రబాబు నాటిన సైబరాబాద్ మొక్కను అంటూ చెప్పుకునే వారు. అయితే తరువాత ఆమె వైసీపీ గూటికి చేరి పలుకు మార్చారు. అసలింతకీ ఆమె పొలిటికల్ జర్నీ ఎలా సాగింది.. ఇప్పుడు వైసీపీ పట్ల ఆమెకు ఎందుకు అంత విరక్తి కలిగిందన్నది చూస్తే...
2014లో ప్రత్తిపాటి పుల్లారావు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరిన విడదల రజినీ తెలుగు ఇంగ్లీష్, హిందీ భాషల్లో అనర్గళంగా మాట్లాడగలగడానికి తోడు మంచి వాక్చాతుర్యం ఉండటంతో అనతి కాలంలోనే తెలుగుదేశం సీనియర్ల గుర్తింపు పొందారు. ఆ క్రమంలోనే అప్పట్లో విశాఖ వేదికగా జరిగిన మహానాడులో మాట్లాడే చాన్స్ పొందారు. ఆ అవకాశం రజనికి పార్టీలో మంచి గుర్తింపు తీసుకు వచ్చింది. అంతే కాకుండా.. హైదరాబాద్‌లోని సైబరాబాద్‌లో మీరు నాటిన ఈ మొక్కను అంటూ రజనీ చేసిన వ్యాఖ్యలు అప్పట్లో అందరినీ బాగా హత్తుకున్నాయి. అదే మహానాడు వేదికపై నుంచి అప్పటి ప్రతిపక్ష నేత వైయస్ జగన్, ఆయన తండ్రి వైయస్ రాజశేఖరరెడ్డిలను నరకాసురులుగా అభివర్ణించిన విడదల రజినీ మాటలకు తెలుగు తమ్ముళ్లే కాదు, వేదికపైన ఉన్న పెద్దలు సైతం ఫిదా అయిపోయారు.
ఈ నేపథ్యంలో చిలకలూరి పేట సీటు కోసం విశ్వప్రయత్నం చేసిన విడదల రజినికి తెలుగుదేశం హైకమాండ్ నిష్కర్షగా నో చెప్పేసింది. దీంతో ఆమె తెలుగుదేశం వీడి జగన్ పార్టీలో చేరిపోయారు. 2019 ఎన్నికలలో ఆ పార్టీ అభ్యర్థిగా చిలకలూరి పేట నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఆ తరువాత జగన్ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో ఏకంగా మంత్రిపదవి సైతం చేజిక్కించుకున్నారు. ఎమ్మెల్యేగా, మంత్రిగా చిలకలూరిపేట కేంద్రంగా రజనీ పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణలు ఉన్నాయి. ఆమెపై పలు కేసులు సైతం ఉన్నాయి. అవన్నీ పక్కన పెడితే 2024 ఎన్నికలలో తన ఘోర పరాజయానికి తనను చిలకలూరి పేట నుంచి గుంటూరుకు మార్చడమేనని గట్టిగా నమ్ముతున్నారు. అందుకే ఓటమి తరువాత ఆమె మళ్లీ చిలకలూరి పేటకు వచ్చేశారు. జగన్ ఆమె రిటర్న్ బ్యాక్ కు అనుమతించారో లేదో తెలియదు కానీ, 2029లో చిలకలూరి పేట నుంచే పోటీ చేయాలన్న ధృఢ నిశ్చయంతో ఆమె ఉన్నారంటారు ఆమె అనుచరులు.
అయితే ఇప్పుడు తాజాగా ఆమెను రేపల్లె వైసీపీ ఇన్ చార్జ్ గా వెళ్లమని జగన్ ఆదేశించారనీ, అది ఇష్టం లేని రజినీ ఇక వైసీపీకి గుడ్ బై చెప్పేయాలనుకుంటున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ ప్రచారానికి కర్త, క్రియ, కర్మ అన్నీ రజినీ వర్గీయులేనని కూడా అంటున్నారు.రేపల్లె ప్రపోజల్ వచ్చినప్పటి నుంచీ రజినీ సైలంట్ అయిపోయారంటున్నారు. చిలకలూరి పేట నియోజకవర్గంలో ఆమె వాయిస్ వినిపించడం లేదు. ఏ కార్యక్రమంలోనూ ఆమె కనిపించడం లేదు. ఇది మాత్రం వాస్తవం. ఇక పోతే వైసీపీకి గుడ్ బై చెప్పి విడదల రజిని చేరే పార్టీ ఏదన్న దానిపై పెద్ద ఎత్తున ఊహాగానాలు వినిపిస్తున్నాయి. జనసేన, బీజేపీ అంటూ ప్రచారం జరుగుతున్నా.. అదేం జరిగే పని కాదన్న అభిప్రాయమూ వ్యక్తం అవుతోంది.
వైసీపీలో ఓ వెలుగు వెలిగిన వాళ్లు.. అలా వెలగడానికి కారణం ప్రత్యర్థులపై ఇష్టారీతిన ఆరోపణలు, విమర్శలూ గుప్పించడమే. అటువంటి వారిని ఇతర పార్టీలు చేర్చుకోవడానికి ఒకటికి వంద సార్లు ఆలోచిస్తారని అంటున్నారు. ఆ రకంగా చూస్తే విడదల రజినికి కూటమి పార్టీల తలుపులు మూసుకుపోయినట్లేనని కూడా అంటున్నారు. మరి ఈ పరిస్థితుల్లో ఆమె వర్గీయులు చేస్తున్న పార్టీ మార్పు ప్రచారం.. జగన్ ను బ్లాక్ మెయిల్ చేసి చిలకలూరిపేటలో కొనసాగడానికే అయి ఉంటుందన్న చర్చ కూడా పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తోంది.