రాజమండ్రి మహిళకు కరోనాస్ట్రెయిన్!
posted on Dec 29, 2020 @ 4:03PM
బ్రిటన్ ను వణికిస్తున్న కొత్త రకం వైరస్ కరోనా స్ట్రెయిన్ ఆంధ్రప్రదేశ్ లోకి ఎంటరైంది. యూకే నుంచి రాజమహేంద్రవరం వచ్చిన మహిళకు స్ట్రెయిన్ సోకినట్లు పరీక్షల్లో తేలిందని వైద్యఆరోగ్యశాఖ కమిషనర్ కాటమనేని భాస్కర్ అధికారికంగా ప్రకటించారు. సీసీఎంబీ, ఎన్‌ఐవీ నివేదికల ఆధారంగా స్ట్రెయిన్ నిర్ధారణ అయినట్లు ధ్రువీకరించారు. సదరు మహిళ 10 రోజుల క్రితం కుమారుడితో సహా యూకే నుంచి రాజమహేంద్రవరం వచ్చారు. ఆమె కుమారుడి సహా కుటుంబసభ్యులకూ కరోనా నెగెటివ్ నిర్ధారణ అయింది. కరోనా స్ట్రెయిన్ సోకిన మహిళ నుంచి మరెవరికీ వైరస్ వ్యాపించ లేదని కాటమనేని భాస్కర్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితిని నిరంతరం సమీక్షిస్తున్నామని.. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. యూకే స్ట్రెయిన్ రాష్ట్రంలో విస్తరించిన దాఖలాలులేవని , అపోహలను నమ్మవద్దని ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు.
దేశవ్యాప్తంగా ఇప్పటివరకు ఆరుగురికి స్ట్రెయిన్ సోకినట్లు కేంద్ర వైద్యఆరోగ్యశాఖ వెల్లడించింది. బెంగళూరులో 3, హైదరాబాద్ లో 2, పూణేలో ఒక యూకే కరోనా కొత్త వైరస్ సోకినట్లు నిర్దారణ అయింది. యూకే నుంచి డిసెంబర్ 9 తర్వాత భారత్ కు 33వేల మంది ప్రయాణికులు వివిధ ఎయిర్ పోర్ట్ ల ద్వారా దేశానికి చేరుకున్నారు. వారిని ట్రేస్ చేసి కరోనా టెస్ట్ లు చేయగా..అందులో 114మందికి కరోనా సోకినట్లు తేలింది.
యూకే నుంచి వచ్చి కరోనా పాజిటివ్ వచ్చిన ఈ 114 మందిలో ఎంతమందికి ఈ యూకే కరోనా కొత్తవైరస్ సోకిందో తెలుసుకునేందుకు దేశ వ్యాప్తంగా ఆరు ల్యాబొరేటరీలకు ఈ జీనోమ్ సీక్వెన్సీకి పంపించారు. అక్కడ పలు టెస్టుల్లో ఆరుగురికి యూకే కొత్త వైరస్ సోకినట్లు గుర్తించారు. అనంతరం ఆ ఆరుగురికి ప్రత్యేకంగా ట్రీట్మెంట్ అందిస్తున్నట్లు చెప్పిన కేంద్రం.., ఈ కరోనా కొత్తవైరస్ పై దేశంలోని అన్నీ రాష్ట్రాల్ని అప్రమత్తం చేసింది.