విగ్రహాల ధ్వంసంపై దళిత నేత సంచలన వ్యాఖ్యలు
posted on Jan 30, 2012 @ 2:16PM
రాజమండ్రి: తూర్పు గోదావరి జిల్లా అమలాపురంలో డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ విగ్రహాల ధ్వంసంపై దళిత నేత బొజ్జా తారకం సంచలన వ్యాఖ్యలు చేశారు. విగ్రహాల ధ్వంసం వెనక రాజకీయ కుట్ర ఉందని ఆయన సోమవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. విగ్రహాల విధ్వంసం కేసులో అరెస్టయినవారంతా అమాయకులేనని ఆయన అన్నారు. అసలు నిందితులను కేసు నుంచి తప్పిస్తున్నారని ఆయన ఆరోపించారు. అసలు నిందితులను తప్పించడం వెనక స్థానిక పార్లమెంటు సభ్యుడు, మంత్రి పాత్ర ఉందని ఆయన విమర్శించారు. విగ్రహాల విధ్వంసం వ్యవహారంలో అసలు కుట్రదారులను బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.
ఇదిలా వుంటే, అంబేడ్కర్ విగ్రహాల విధ్వంసంపై దళిత మంత్రులు సమావేశమయ్యారు. ధ్వంసమైన విగ్రహాల స్థానంలో కాంస్య విగ్రహాలను నెలకొల్పాలని సమావేశానంతరం గీతా రెడ్డి అన్నారు. విగ్రహ విధ్వంసానికి పాల్పడిన వారిపై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టాలని కూడా ఆమె సూచించారు. త్వరలో హైదారబాద్‌లో దళితుల అభివృద్ధిపై జాతీయ స్థాయి సమావేశం ఏర్పాటు చేస్తామని మరో మంత్రి శైలజానాథ్ చెప్పారు.