పెరుగుతున్న ఉష్ణోగ్రత! మరోపక్క హైదరాబాద్‌కు వర్ష సూచన!
posted on Mar 28, 2020 @ 10:01AM
దక్షిణ ఇంటీరియర్ కర్ణాటక నుండి దక్షిణ గుజరాత్ వరకు, ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక మరియు మధ్య మహారాష్ట్ర మీదుగా 0.9 km ఎత్తు వరకు ఉపరితల ద్రోణి ఏర్పడిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రము సంచాలకులు తెలిపారు. దీని ప్రభావంతో ఈ రోజు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. రేపు అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.
తెలంగాణలో ఎండలు బగబగలాడుతున్నాయి. దీనితో గ్రేటర్ హైదరాబాద్‌లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ వేసవికాలంలో తొలిసారిగా 37.0 డిగ్రీలు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కావడం గమనార్హం. వారం క్రితం 36.2 డిగ్రీలు ఉండగా.. నిన్న శుక్రవారం 37.0 డిగ్రీలు నమోదు కావడంతో పగలు భానుడు బగబగకు ఎండలు ఠారెత్తిస్తున్నాయి. అటు కనిష్ట ఉష్ణోగ్రతలు కూడా సాధారణ స్థాయిని ధాటి 22.9 డిగ్రీల సెల్సియస్ నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.
ఇక ఉపరితల ద్రోణి ఏర్పడిన నేపధ్యంలో రాగల రెండు రోజుల్లో రాజధానిలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం వున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.