రైల్వే బోర్డు సభ్యుడి పదవికి 10 కోట్లు లంచం మరీ తక్కువేమో

 

రైల్వేమంత్రి పవన్ కుమార్ బన్సాల్ మేనల్లుడు విజయ్ సింగ్లీ రూ.90 లక్షలు లంచం తీసుకొంటుండగా సీబీఐకి పట్టుబడటం, మంత్రి గారి రాజినామాకి పార్లమెంటులో ప్రతిపక్షాల డిమాండ్, దానిని కాంగ్రెస్ యధావిదిగా తిరస్కరించడం అన్నీ నిత్యపారాయణం అయిపోయాయి. కానీ, రైల్వే బోర్డు విద్యుత్ విభాగంలో సభ్యుడి పదవి కోసం, మహేష్ కుమార్ అనే ఉన్నతాధికారి ఏకంగా రూ.10 కోట్లు లంచం ఇచ్చేందుకు మంత్రిగారి మేనల్లుడితో బేరం ఆడుకోవడం చూస్తే ఆ పదవి ఎంత ప్రాముఖ్యమయినదో అర్ధం అవుతోంది. అసలు ఆ పదవి ప్రాముఖ్యత ఏమిటి? అంత ప్రాముఖ్యత ఉన్న పదవిని సాక్షాత్ మంత్రి గారి మేనల్లుడే స్వయంగా ‘హ్యాండిల్’ చేస్తున్నాడని తెలిసినపటికీ మద్యలో సీబీఐ ఎందుకు దూరింది? దూరి ఈ డొంక ఎందుకు లాగింది? దీనికి సమాధానం కావాలంటే ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ స్టోరీ గురించి తెలుసుకోవాలి.

 

ప్రస్తుతం సీబీఐ డైరెక్టరుగా ఉన్న రంజిత్ సిన్హా గతంలో అంటే 2008-11సం.ల మద్య రైల్వేలో ‘రైల్వే ప్రొటక్షన్ ఫోర్స్’కి డైరెక్టరు జనరల్ గా పని చేసారు. ప్రస్తుతం రైల్వేబోర్డు విద్యుత్ విభాగంలోసభ్యుడి పదవి కోసం, రూ.10 కోట్లు లంచం ఇవ్వజూపిన మహేష్ కుమార్ కూడా అదే సమయంలో రైల్వేలోనే చేస్తున్నారు. కానీ, క్రమంగా వీరిరువురికి ఒకరితో మరొకరికి పడక పోవడంతో ఒకరిపై మరొకరు. నాటి రైల్వేమంత్రి మమతా బెనర్జీకి పిర్యాదులు చేసుకొనేవారు. మమత కూడా మహేష్ వైపే మొగ్గు చూపడంతో, రంజిత్ సిన్హాకి ‘ఇండో టిబెటన్ బోర్డర్ పోలీసు’ విభాగంలోకి బదిలీ చేయబడ్డారు.

 

మహేష్ కుమార్ వలన అనేక ఇబ్బందులు పడి, చివరికి అవమానకర పరిస్థితిలో బదిలీ చేయబడటంతో రంజిత్ సిన్హా దీనికి అంతటి కారకుడయిన మహేష్ కుమార్ పై కోపంతో రగిలిపోతున్నారు. అదృష్టవశాత్తు గత ఏడాదే రంజిత్ సిన్హా సీబీఐలో వచ్చిపడ్డారు. ఇక, నాటి నుండి మహేష్ కుమార్ పై ప్రతీకారం తీర్చుకొనేందుకు తగిన సమయం కోసం ఓపికగా నిరీక్షించారు. ఈ లోగా ఆయనపై, ఆయన ఫోన్ కాల్స్ పై ప్రత్యేక నిఘా కూడా పెట్టి ఉంచారు. చివరికి ఆయన ఊహించినట్లే, మహేష్ కుమార్ మంత్రి గారి మేనల్లుడితో బోర్డు పదవికోసం బేరం ఆడుకోవడం ముందే కనిపెట్టిన సీబీఐ బృందం సింగ్లీ ఇంటి వద్ద, ముంబై విమానాశ్రయం వద్ద వలపన్ని కూర్చొని ఉంటే, చండీగడ్ లో సింగ్లీ, ముంబై లో మహేష్ ఇద్దరూ తమంతట తామే నేరుగా వచ్చి వలలోచిక్కుకొన్నారు. చివరికి రంజిత్ సిన్హా తన పగ తీర్చుకోగలిగాడు.

 

ఇక ఒక బోర్డు సభ్యుడి పదవికి ఏకంగా రూ.10 కోట్ల లంచం ఎందుకంటే, ఆ సభ్యుడి చేతిలో ఒకటి కాదు, వందాకదు ఏకంగా రూ.2500 కోట్ల విలువయిన విద్యుత్ కాంట్రాక్టు వ్యవహారాలు ఉంటాయి గనుక! దీనికి అధనంగా కోలకతలో మెట్రో రెయిల్ పనులు, త్వరలో ప్రవేశ పెట్టనున్న స్పీడ్ ట్రైన్స్ ప్రోజక్టులు ఉంటాయి. ఈ ప్రాజెక్టులో ఒక కిలో మీటర్ విద్యుత్ రైల్వే లయిన్ వేయడానికి రూ.200 కోట్లు అవుతుందని అంచనా వేయగా, ఆ స్పీడ్ ట్రైన్స్ కి అవసరమయిన ఒక్కో పెట్టె తయారికీ భారీ గానే ఖర్చుఉంటుందని అంచనాలున్నాయి.

 

ఈ వ్యవహారలనీ కలిపి కనీసం రూ.5000-6000 కోట్లు ఉంటుంది. ఈ వ్యవహారాలన్నీకూడా రైల్వే బోర్డు విద్యుత్ విభాగంలో సభ్యుడి పర్యవేక్షణలో జరుగుతాయి. ఆ సభ్యుడి సంతకం, ఆమోదం లేనిదే ఏపని జరుగదు. అటువంటప్పుడు వివిధ కాంట్రాక్టు లు చెప్పట్టే కాంట్రాక్టర్ లు కూడా అదే స్థాయిలో మామూళ్ళు ముట్ట జెప్పడం ఖాయం. వేలకోట్ల లోంచి కనీసం వందల కోట్లయినా గిల్లుకోవచ్చును. అటువంటి కీలకమయిన పదవికి ఒక 10కోట్లు పెద్ద ఎక్కువేమి కాదని చిన్న పిల్లాడిని అడిగినా చెప్పగలడు. ఇక ఎన్నో ఏళ్లతరబడి రైల్వేలలో పాతుకుపోయిన మహేష్ కుమార్ రిటైర్ అయ్యేలోగా ఏదో నాలుగు రాళ్ళు వెనకేసుకొందామని ఆలోచిస్తే, సినిమాలో విలన్ లాగా రంజిత్ సిన్హా ప్రవేశించి కధ మొత్తం రసబాస చేసాడు.