మళ్ళీ రాష్ట్రానికి అవే విదిలింపులు

 

గత మూడు దశాబ్దాలుగా రైల్వేమంత్రిగా ఎవరు బాధ్యతలు చేప్పటినప్పటికీ, అందరికీ మన రాష్ట్రం అంటే చిన్న చూపే. వివిధ రాష్ట్రాలకు చేసిన కేటాయింపులతో పోలిస్తే, మన రాష్ట్రం ఎప్పుడు కూడా ఆఖరి వరుసలోనే ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ మనుగడకు 42 మంది యం.పీ.లను మన రాష్ట్రం అందిస్తున్నప్పటికీ, మరెందుకో తెలియదు కానీ మొదటి నుండి మన రాష్ట్రం అంటే చిన్నచూపే. అయినప్పటికీ, కేంద్రం పట్ల మన విదేయతలో వీసమంత మార్పులేదు. నిలదీసి ప్రశ్నించే ప్రసక్తే లేదు.

 

తమిళనాడు, ఒరిస్సా, రాజస్తాన్,బీహార్, బెంగాల్ మొదలయిన రాష్ట్రాలకు చెందిన నేతలు, తమకు అవసరమయిన ప్రాజెక్టులను, రైల్వే లయిన్లను, కొత్త రైళ్ళను తీవ్ర ఒత్తిడి చేసి మరీ సాధించుకొంటుంటే, మన రాష్ట్రానికే చెందిన కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి సాక్షాత్ రైల్వే శాఖ సహాయ మంత్రిగా ఉన్నపటికీ కొత్తగా సాదించింది ఏమి లేదు. ఇక రైల్వేలోఉన్న మంత్రిగారే ఏమిచేయలేన్నపుడు, ఇక మన 42 మంది యం.పీ.లు మనకి ఏదో ఓరగబెడతారనుకోవడం ఒట్టి భ్రమ.

 

కొంతమంది యం.పీ.లు తమకి తెలంగాణా సమస్య కంటే మరేమీ ప్రాధాన్యం లేదని బహిరంగంగానే చెపుతారు. మిగిలిన వారు రాజకీయ రాజకీయ ప్రయోజనాలను కాపాడుకోవడంలో, పార్టీ అంతర్గత కుమ్ములాటలతో, తమ స్వంత వ్యాపారాలు, కాంట్రాక్టులతో క్షణం తీరిక లేకుండా గడుపుతుంటారు.

 

రాష్ట్ర ప్రయోజనాలకంటే స్వప్రయోజనాలే వారికి మిన్న. ఒకవేళ ఎవరయినా యం.పీ. డిల్లీ చుట్టూ తిరిగి ఒక రైల్వే ప్రాజెక్ట్ కానీ, మరొకటి కానీ సాదించేందుకు కృషి చేస్తుంటే, తమ రాజకీయ ప్రాభల్యం ఎక్కడ దెబ్బతింటుందో అనే బెంగతో, అతని లేదా ఆమె కాళ్ళుపట్టుకు లాగడానికి ప్రయత్నించేవారే తప్ప, వారితో చేతులు కలిపి కృషిచేయడం అరుదు. కొందరికి ప్రాంతీయ వాదం అడ్డొస్తే, మరికొందరికి అసూయ, అహం, బేషజం వంటివి అడ్డొస్తాయి.

 

మొత్తం మీద, ప్రతీ ఏట రైల్వేమంత్రిగారు మనకి మొండి చేయడం చూపడం, మనకి రావాల్సిన, దక్కాల్సిన, రైళ్ళను, ప్రాజెక్టులను ఇరుగుపొరుగు రాష్ట్రాలవారు గద్దలా తన్నుకు పోవడం షరా మామూలే. ప్రజలు నిస్సహాయంగా చూస్తూ ఈ విధంగా ఆక్రందనలు చేయడము మామూలే.

 

తిరుపతి, విశాఖలలో కొత్త రైల్వే జోన్ల ఏర్పాటు, రాష్ట్రంలో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు, రాష్ట్రంలో వివిధ ప్రాంతాలను దేశంలో ప్రముఖ నగరాలతో కలుపుతూ కొత్త రైళ్ళు వంటి డిమాండ్లు చాలానే ఉన్నపటికీ, ఈసారి రైల్వే బడ్జెట్లో కర్నూల్ లో వేగన్ రిపేర్ వర్క్ షాప్, 22కొత్త లైన్ల నిర్మాణానికి అనుమతులు మాత్రమే పెర్కొనవలసినవి. ఈ కొత్త ప్రాజెక్టులు ఈ ఏడాది మొదలు పెడితే అవి ఎన్ని సంవత్సరాల తరువాత పూర్తవుతాయో ఎవరికీ తెలియదు. అందువల్ల వాటివల్ల రాష్ట్రానికి ఇప్పటికిప్పుడు ఒరిగేదేమీ లేదు.

 

రాష్ట్రానికి రెండు,మూడు కొత్త రైళ్ళను విదిలించిన మన రైల్వేమంత్రి బన్సాల్ గారు, విజయవాడలో రైల్‌నీరు బాటిలింగ్‌ ప్లాంటును, విశాఖలో డిల్లీ తరహాలో (విదేశీ) పర్యాటకులకు విలాసవంతమయిన విశ్రాంతి గదులను ఏర్పాటు చేయడమే ఆయన మన రాష్ట్రానికిచ్చిన ఒక పెద్దవరం అన్నట్లు అభివర్ణించి చెప్పడం పుండు మీద కారం చల్లడమే అవుతుంది. విజయవాడలో నీళ్ళ ప్లాంటు, విశాఖలో విలాసవంతమయిన విశ్రాంతి గదులవల్ల రాష్ట్రంలో మిగిలిన ప్రాంతాల వారికి ఏమి ప్రయోజనమో ఆయనే చెప్పాలి.

 

ప్రజలు కోరుకొంటున్నవాటికి, ఆయన ఇస్తున్నవాటికీ ఎక్కడా పొసగదు. ప్రజలకి కొత్త రైళ్ళు కావాలి, కొత్త రైల్వే జోన్లు కావాలి, ఉపాధి కల్పించే కోచ్చ్ ఫ్యాక్టరీ కావలి తప్ప నీళ్ళ ప్లాంటులు, లిఫ్టులూ, విలాసవంతమయిన విశ్రాంతి గదులు కాదు. మన యం.పీ.లలో చైతన్యం లేనపుడు, మంత్రిగారు మాత్రం ఏమిచేస్తారు? అడగందే అమ్మయినా పెట్టదని పెద్దలు ఊరికే అనలేదు.