త్వరలో రైళ్లు బంద్! రైల్వే బోర్డు క్లారిటీ..
posted on Apr 9, 2021 @ 5:05PM
ఇప్పటికే నైట్ కర్ఫ్యూ. మళ్లీ లాక్‌డౌన్ దిశగా అడుగులు. స్కూళ్లు, థియేటర్లు, బార్లు, పబ్‌లు అన్నీ మూసేస్తారట. త్వరలోనే రైళ్లు కూడా బంద్. ఇలా రోజుకో న్యూస్. వీటన్నిటిలోకి రైళ్లు బంద్ అనే మాట వలస కూలీలను హడలెత్తిస్తోంది. లాక్‌డౌన్ ప్రకటించి, రైళ్లు నిలిపేస్తే.. ఇక తమ పని క్లోజ్ అంటూ కూలీలు భయాందోళన చెందుతున్నారు. గత అనుభవాలను గుర్తు చేసుకొని వణికిపోతున్నారు. దీంతో, పోలో మంటూ వలస కూలీలంతా సొంతూళ్లకు పయనమవుతున్నారు. రైల్వే స్టేషన్లన్నీ కూలీలతో నిండుతున్నాయి. రైళ్ల ముందు కార్మికులు క్యూ కడుతున్నారు. ఢిల్లీ, ముంబై నుంచి వివిధ రాష్ట్రాలకు వెళ్లే రైళ్లన్నీ ఇప్పుడు నిండుగా కనిపిస్తున్నాయి.
రైళ్లన్నీ ఫుల్ అవుతుండటంతో రైల్వే శాఖ అలర్ట్ అయింది. సడెన్‌గా ఇంత మంది ఎందుకు ప్రయాణిస్తున్నారని ఆరా తీసింది. వలస కూలీలు స్వగ్రామాలకు తిరిగి వెళుతున్నారని తెలిసింది. త్వరలోనే రైళ్లు బంద్ చేస్తారనే ప్రచారమే వారిలో రద్దీకి కారణమని గుర్తించారు. వెంటనే రైల్వే బోర్డు ఛైర్మన్ సునీత్ శర్మ స్పందించారు. ఇప్పట్లో రైళ్లను నిలిపివేసే ఆలోచనేదీ లేదని స్పష్టం చేశారు. అవసరమైతే డిమాండ్‌ను బట్టి మరిన్ని రైళ్లను పెంచుతామని హామీ ఇచ్చారు.
‘‘రైలు సేవలను తగ్గించడం లేదా నిలిపివేసే ప్రణాళికేదీ లేదు. అవసరమైనన్ని రైళ్ల రాకపోకలను కొనసాగిస్తాం. వేసవి సీజన్‌లో రైళ్లలో రద్దీ సహజమే. ప్రస్తుతం రైళ్ల కొరత లేదు. ఒకవేళ ప్రయాణికుల రద్దీ పెరిగితే అందుకు అనుగుణంగా రైళ్ల సేవలను కూడా పెంచుతాం’’ అని ఆయన మీడియాకు వెల్లడించారు. అంతేగాక, రైళ్లలో ప్రయాణించేందుకు కొవిడ్ నెగెటివ్ పత్రం తప్పనిసరి అని వస్తున్న వార్తలను కూడా ఆయన కొట్టిపారేశారు. రైల్వేలో అలాంటి పత్రం అడగట్లేదని.. అదంతా అసత్య ప్రచారమని స్పష్టం చేశారు రైల్వే బోర్డు ఛైర్మన్ సునీత్ శర్మ.