యువరాజవారి తాజా లెక్చర్
posted on Feb 27, 2014 @ 10:33AM
మన యువరాజ వారికి అవకాశం దొరకాలే కానీ ఏవిషయంపైనైనా అనర్గళంగా లెక్చర్లు దంచుతుంటారు. కానీ, ‘ఎదుటవాడికి చెప్పేటందుకే నీతులు ఉన్నాయి’ అని ఎవరో కవి చెప్పినట్లు ఆయన లెక్చర్లు కూడా ఎదుటవాడి కోసమే తప్ప అవి తనకు, తన పార్టీకి వర్తింపవని ఆయన దృడంగా నమ్ముతారు. అందుకే తమ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోఉన్న డిల్లీలోనే ఏడాదిన్నర క్రితం ఒక అబల మీద బస్సులో సామూహిక అత్యాచారం జరిగితే నోరు మెదపని ఆయన, నిన్న అస్సోం డాన్ బాస్కో విశ్వవిద్యాలయంలో విద్యార్దినులతో మాట్లాడుతూ ‘మహిళలు-రక్షణ’ అనే అంశంపై చిన్న లెక్చర్ దంచిన తరువాత, అలా దంచినందుకు చాలా బాధ కలుగుతోందని, కానీ ఆవేశం ఆపుకోలేక దంచిపడేశానని ముగించారు. భారత్ జనాభాలో సగం ఉన్న మహిళలకు భద్రత, సమాజంలో సమాన హోదా, గౌరవం కల్పించిన తరువాతనే భారత్ సూపర్ పవర్ గా ఎదగడం గురించి మాట్లాడుకోవచ్చని ఒక ఉచిత అభిప్రాయం కూడా వ్యక్తం చేసారు. నిజానికి డిల్లీలో ఆ ఘోర సంఘటన జరిగిన తరువాత నుండి డిల్లీతో సహా దేశ వ్యాప్తంగా మహిళల మీద చివరికి అన్నెం పున్నెం ఎరుగని బాలికలు, పసిపిల్లల మీద అత్యాచారాలు విచ్చలవిడిగా జరుగుతున్నా, మన యువరాజవారు ఏనాడు నోరు మెదిపిన పాపాన పోలేదు. కనీసం తమ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాష్ట్రాలలోనయినా అటువంటి ఘోర అకృత్యాలు జరుగకుండా నివారించేందుకు తగిన చర్యలు చెప్పట్టమని గట్టిగా ఆదేశించి ఉండవచ్చును. కానీ, యువరాజవారికి లెక్చర్లు దంచడంపై ఉన్న మక్కువ, నేర్పు వాటిని ఆచరణలో పెట్టడంలో కనబడదు. కనుక, మతకలహాలు జరిగినప్పుడు ఆయన బీజేపీని విమర్శించవచ్చు. ఉగ్రవాదుల దాడులు జరిగినప్పుడు తండ్రిని నాయనమ్మను తలచుకొని బాధపడవచ్చును. అది ఎన్నికల సమయం అయితే ‘తను కూడా ఏదో ఒకనాడు ఉగ్రవాదుల దాడిలో చనిపోతానేమో’ నని సానుభూతి ఓట్లు ఆశించవచ్చును. ఆదర్శ్ కుంభకోణాలు బయటపడినప్పుడు తను ప్రతిపాదించిన అవినీతి బిల్లుల గురించి వాటికి ప్రతిపక్షాల సహాయ నిరాకరణ చేయడం గురించి లెక్చర్లు దంచవచ్చును. టాపిక్ ఏదయినా సరే లెక్చర్ కి రెడీ...దటీజ్ ప్రిన్స్ స్టైల్...