దౌత్యం ఫలిస్తుందా.. లేదా..

 

 

రాష్ట్రంలో రాజకీయాలు రోజుకో తీరుగా మారిపోతున్నాయ్. ఎవరు ఎప్పుటడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో తెలీని పరిస్థితి. ఎన్నికలు దగ్గరికొస్తున్నకొద్దీ కుల సమీకరణాలు, వర్గ సమీకరణాలు, మత సమీకరణాలు ఎక్కువైపోతున్నాయ్.

ఎటువైపు లాభముంటే అటువైపు దూకడానికి పార్టీలు, నేతలు ఏమాత్రం మొహమాటపడడం లేదు. వాస్తవానికి రాష్ట్రంలో ప్రస్తుతం వైఎస్సాఆర్ పార్టీలోకి అన్ని పార్టీలనుంచీ వలసలు ఎక్కువైపోయాయ్. ఈ పరిస్థితుల్లో ఎంఐఎం కూడా గుడ్డకాల్చి కాంగ్రెస్ నెత్తిమీదేసి తనదారి తనుచూసుకోవడం అధిష్ఠానానికి ఓ రకంగా షాక్.

పరిస్థితిని నిశితంగా గమనిస్తున్న కాంగ్రెస్ అధిష్ఠానం ఇలాంటి పరిణామాల్ని ముందరినుంచీ ఊహిస్తూనే ఉంది. అందితే జట్టూ అందకపోతే కాళ్లూ పట్టుకునే మనస్తత్వం కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు కొత్తగా అబ్బిన విద్యేమీ కాదు. జనం అంతా అనుకున్నట్టుగా ఈ సమస్యని సాల్వ్ చేయడానికి సోనియా పెద్దగా కష్టపడాల్సిన విషయం కూడా ఏం లేదు.

 

యువరాజు రాహుల్ గాంధీ ఆల్రెడీ రంగంలోకి దిగారు. తానే నేరుగా అసదుద్దీన్ ఓవైసీతో ఫోన్ లో మాట్లాడారు. త్వరలోనే రాజీ కుదుర్చుకునేందుకు ఎంఐఎంని తిరిగి తన గూటిలోకి తెచ్చుకునేందుకు ప్రత్యేకంగా ఓ దూతని రాష్ట్రానికి పంపించేందుకు ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయ్.

 

ఏం కావాలన్నా ఇచ్చి అసదుద్దీన్ ని బుజ్జగించే ప్రయత్నం చేయాలన్నది యువరాజు రాహుల్ ఆలోచన. చిన్న పామునైనా  పెద్ద కర్రతో కొట్టాలన్న ఫార్ములాని ఎంఐఎం విషయంలో అవలంబించాలని రాహుల్ గట్టి నిర్ణయంతో ఉన్నట్టు సమాచారం.

 

దేశవ్యాప్తంగా ఉన్న మైనార్టీల్ని తనవైపు తిప్పుకుని జాతీయ స్థాయిలో అఖండ శక్తిగా ఎదగాలన్న ఎంఐఎం ప్రయత్నేం పారితే ఇంతకాలం కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడ్డ మైనారిటీలు దూరమైపోతారు. హిందుత్వ కార్డ్ ని అడ్డంపెట్టుకుని బిజెపి కొన్ని ఓట్లు కొల్లగొడుతుంది. అప్పుడు కాంగ్రెస్ పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడి అవుతుంది.

 

 

అందుకే రాహుల్ ఈ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకుంటున్నారు. పరిస్థితి ఇంతవరకూ వచ్చేదాకా ఏం చేస్తున్నారంటూ అధిష్ఠానం పెద్దలు కిరణ్ కుమార్ కి తలంటినట్టుకూడా సమాచారం. ఈ దెబ్బతో కిరణ్ కుర్చీ ఖాళీ అవుతుందని ప్రత్యర్ధులు పండగకూడా చేసుకుంటున్నారు.