సీఎం జగన్ క్షమాపణ చెబితేనే పదవి నిలుస్తుంది.. లేదంటే గోవిందా..
posted on Oct 16, 2020 @ 7:26PM
ఏపీ సీఎం జగన్ కు వైసీపీ రెబల్ ఎంపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు అమూల్యమైన సలహా ఇచ్చారు. ఈరోజు ఢిల్లీలోని తన నివాసంలో రచ్చబండ కార్యక్రమంలో భాగంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, జగన్ కేసులపై హైదరాబాదు సీబీఐ కోర్టులో విచారణ మొదలవుతోందని, బహుశా దీనికోసం ఇకపై జగన్ హైదరాబాదులోనే ఉండాల్సి రావొచ్చని అయన అన్నారు. అయితే ఈ కేసుల నుంచి సీఎం జగన్ బయటపడొచ్చని అనుకున్నా, ఇటీవల కోర్టులపై ఆయన చేసిన వ్యాఖ్యల నుంచి ఎంతమాత్రం తప్పించుకోలేరని అయన స్పష్టం చేశారు. కోర్టు ధిక్కరణకు పాల్పడిన సీఎం జగన్మోహన్ రెడ్డి తన పదవి కోల్పోవాల్సి వస్తుందని అన్నారు. అయితే తప్పు జరిగిందని భావించి క్షమాపణలు చెబితే మాత్రం.. ముఖ్యమంత్రి పదవి నిలిచే అవకాశాలు ఉన్నాయని అయన పేర్కొన్నారు. ప్రభుత్వం న్యాయవ్యవస్థపై దాడి చేయడం సరికాదని ఈ సందర్భంగా రఘురామ రాజు అన్నారు.
న్యాయవ్యవస్థపై దాడిని నిరసిస్తూ దేశవ్యాప్తంగా..న్యాయవాదులు ఉద్యమం చేపట్టే అవకాశాలున్నాయని అయన అన్నారు. న్యాయవ్యవస్థకు క్షమాపణలు చెప్పి జగన్ సీఎంగా కొనసాగాలని, ఒకవేళ అలా కాని పక్షంలో సీఎం పదవికి వేరేవారిని సిద్ధం చేసుకోవాలని రఘురామ రాజు సూచించారు. బహుశా విజయలక్ష్మి, భారతి గార్లు కూడా సీఎం కావచ్చునని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. వివేకా హత్య కేసును సెక్షన్ 174 కింద నమోదు చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని అయన డిమాండ్ చేశారు. ఇక రాజధాని భూముల్లో ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరగలేదని అయన అన్నారు.
ఇక తనపై విమర్శలు చేస్తున్న వారినుద్దేశించి మాట్లాడుతూ.. "సోషల్ మీడియాలో కొందరు దరిద్రులు ఉన్నారని, ప్రెస్ మీట్ చెట్టుకింద కాకపోతే కుప్పతొట్టి పక్కన పెట్టుకోరా.. అని తనపై విమర్శలు చేస్తున్నారని అంటూ.. అలాంటి వాళ్లను అయన పందులతో పోల్చారు. సీఎం జగన్ పదవి పోగొట్టుకునే వరకు ఇలాగే అనండ్రా వెధవల్లారా, ఇలాంటి పనికిమాలిన పోస్టులు కాదురా పెట్టాల్సింది దరిద్రుల్లారా!" అంటూ మండిపడ్డారు.