గూడ్స్ రైళ్ల కోసం ఢిల్లీలో పంజాబ్ సీఎం ధర్నా! రూ.1200 కోట్లు నష్టపోయామన్న రైల్వేశాఖ
posted on Nov 4, 2020 @ 4:16PM
కేంద్ర ప్రభుత్వంపై పోరాటం తీవ్రతరం చేశారు పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్. పంజాబ్‌కు గూడ్స్ రైళ్లను నిలిపేయడాన్ని నిరసిస్తూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆయన ధర్నాకు దిగారు. ఆయనతో పాటు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా ఆందోళనలో పాల్గొన్నారు. మోడీ సర్కార్ పై తీవ్ర ఆరోపణలు చేశారు అమరీందర్ సింగ్. పంజాబ్ పరిస్థితిని రాష్ట్రపతికి తెలపడానికి ప్రయత్నిస్తే తమకు సమయం కేటాయించలేదని చెప్పారు. అందుకే ఢిల్లీకి వచ్చి తామ నిరసనన తెలుపుతున్నామన్నారు. ఈ విషయంపై ఇంకా ప్రధాని మోడీ అపాయింట్‌మెంట్ అడగలేదని, అదే ప్రయత్నంలో ఉన్నామని తెలిపారు అమరీందర్ సింగ్. తమకు రావాల్సిన జీఎస్టీ నిధులు ఇప్పటికీ రాలేదని పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ ఆరోపించారు.
కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ పంజాబ్ అంతటా రైతులు పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. కొన్ని రోజులుగా రైల్ రోకో, ధర్నాలకు దిగుతున్నారు. దీంతో రైల్వే ఆస్తులకు, యాజమాన్యానికి నష్టాలు కలుగుతోంది. ఈ పరిణామాలను పరిగణనలోకి తీసుకున్న కేంద్ర రైల్వే శాఖ... పంజాబ్ ప్రాంతానికి గూడ్స్ రైళ్లను తాత్కాలికంగా నిలిపివేయాలని నిర్ణయించుకుంది. దీనికి నిరసనగానే పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ ధర్నాకు దిగారు.
తమ రాష్ట్రానికి గూడ్స్ రైళ్లను రద్దు చేసి మోడీ ప్రభుత్వం తమ గొంతు నులిమేస్తోందని పంజాబ్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తీవ్రంగా మండిపడ్డారు. రాష్ట్రంలో కరెంట్ కోతలు కూడా తీవ్రయ్యాయని, రాష్ట్రానికి అవసరమైన 14.50 లక్షల టన్నుల యూరియాను ట్రక్కుల్లో తెచ్చుకుంటున్నామని ఎమ్మెల్యేలు చెప్పారు. పరిస్థితి ఇంత తీవ్రంగా ఉన్నా... కేంద్రం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. తమ దగ్గర ఉన్న కొద్దిపాటి నిధులతో కేంద్రం నుంచి విద్యుత్తును కొనుగోలు చేస్తున్నామని చెప్పారు పంజాబ్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు.
మరోవైపు పంజాబ్‌లో రైతుల ఆందోళనలతో తమకు రూ.1,200 కోట్ల మేరకు నష్టం వచ్చిందని రైల్వేశాఖ ప్రకటించింది. దిగ్బంధాల కారణంగా రవాణా కార్యకలాపాలు ఇప్పటికీ సస్పెండైనట్టు తెలిపింది. నిత్యావసర సరుకలు తీసుకువెళ్తున్న 2,225 ఫ్రైట్ రేక్స్ తెరుచుకోలేదని రైల్వే అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ఇంతవరకూ 1,350 ప్యాసింజర్ రైళ్లు రద్దయ్యాయని, కొన్నింటిని దారి మళ్లించాల్సి వచ్చిందని ప్రకటించారు. రైతు నిరసనల ప్రభావం పంజాబ్ మీదుగా వెళ్లే ప్యాసింజర్ రైళ్లపై కూడా పడిందని చెప్పారు. ట్రాక్‌ల భద్రత, రైల్ ఆపరేషన్ల పునరుద్ధరణ జరిపే సిబ్బందికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలంటూ అక్టోబర్ 26న రైల్వే మంత్రి పీయూష్ గోయెల్ పంజాబ్ ప్రభుత్వానికి లేఖ రాసినా .. అక్కడి నుంచి స్పందన రాలేదని రైల్వే అధికారులు చెప్పారు.