జై భారత్.. పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో మార్మోగుతున్న నినాదాలు!
posted on Feb 20, 2023 @ 10:53AM
నిర్బంధం, వివక్ష, అభివృద్ధి లేమి.. పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్(పీవోకే) లో భారత అనుకూల ఆందోళనలకు దారి తీశాయి. అసలే ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయి, దివాళా తీసిన పాకిస్థాన్ ( ఆ దేశ రక్షణ మంత్రే దివాళా అని ప్రకటించారు), ఇప్పుడు వేర్పాటు ఉద్యమం.. కాదు కాదు పీవోకేలో భారత్ లో విలీనం డిమాండ్ లో విలీన ఉద్యమం తారస్థాయికి చేరింది.
1947లో జమ్ము-కశ్మీర్ నుంచి కొంత భాగాన్ని పాకిస్థాన్ ఆక్రమించుకుంది. ఆ ప్రాంతాన్నే పాక్ ఆక్రమిత కాశ్మీర్ గా పిలుస్తున్నారు. ఈ ప్రాంతాన్ని పాకిస్థాన్ ఆజాద్ కాశ్మీర్, గిల్గిట్ బాల్టిస్థాన్ గా విభజించింది. పాక్ ఆక్రమిత కశ్మీర్ జనాభా (అజాద్ కశ్మీర్, గిల్గిత్ బాల్టిస్థాన్) 2020 నాటికి దాదాపు 52 లక్షలు. 1947కు ముందు పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ కూడా జమ్మూ-కశ్మీర్లో భామే. పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని రెండు భాగాలలో ఒకటైనగిల్గిట్ బాల్టిస్టాన్ లో భారత్ లో విలీనం డిమాండ్ తో జనం రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తున్నారు.
విభజన సమయంలో, జమ్మూ కశ్మీర్ భారతదేశం లేదా పాకిస్థాన్లో చేరాలా అనే అంశంపై ఆనాటి పాలకుడు మహారాజా హరిసింగ్ దానిని స్వతంత్ర దేశంగా ఉంచాలని నిర్ణయించుకున్నారు. అయితే జమ్ము-కశ్మీర్ లో శాంతియుత పరిస్థితులు పునరుద్ధరణ తరువాత ఆ ప్రాంతం విలీనం గురించి ప్రజాభిప్రాయం ప్రకారం నడుచుకోవాలని అప్పటి భారత గవర్నర్ జనరల్ మౌంట్ బాటిన్ సూచన మేరకు ప్రయత్నాలు జరిగినా.. అది జరగలేదు. అనంతరం హరిసింగ్ 1947 అక్టోబర్ లో ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ అక్సెషన్ కు గవర్నర్ జనరల్ లార్డ్ మౌంట్ బాటన్ ఆమోదంతోనే కాశ్మీర్ వివాదానికి బీజం పడింది.
ఏడు దశాబ్దాలుగా దోపిడీ, వివక్షలు అనుభవిస్తూ గడిపిన పాక్ ఆక్రమిత కాశ్మీర్ ప్రజలకు భారత్ లో అభివృద్ధి, సంస్కరణలు తమ దయనీయ స్థితి నుంచి విముక్తి పొందే మార్గాన్ని చూపించాయి. తాము ఒకపక్క అనేక సమస్యలతో సతమతమవుతుంటే తమకు పోరుగునే ఉన్న భారత్ లోని కశ్మీర్ అభివృద్ధిలో నడుస్తుండడంతో తాము కూడా భారత్ లో కలవాలన్న కాంక్ష పెరిగింది. అదే వారిని విలీన ఉద్యమానికి ఆకర్షితులను చేస్తున్నది.