మొంథా తుపాన్.. సన్నద్ధతపై చంద్రబాబుకు మోడీ ఫోన్
posted on Oct 27, 2025 @ 2:31PM
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై పెను ప్రభావం చూపనున్న మమొంథా తుపానును ఎదుర్కోవడానికి రాష్ట్ర ప్రభుత్వ సన్నద్ధత ఎలా ఉంది? కేంద్రం నుంచి ఎటువంటి సహాయ సహకారాలు కావాలి అంటూ ప్రధాని నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడిని అడిగారు. ఇందుకోసం ఆయన స్వయంగా చంద్రబాబుకు ఫోన్ చేశారు. ఈ సందర్భంగా కేంద్రం నుంచి అవసరమైన సంపూర్ణ సహాయ సహకారాలు అందజేస్తామని మోడీ భరోసా ఇచ్చారు. కాగా తుపాను సన్నద్ధత, కేంద్ర బృందాలు అందిస్తున్న సహకారం, ప్రాణ, ఆస్తినష్టం కనిష్ఠానికి పరిమితమయ్యేతా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఈ సందర్భంగా చంద్రబాబు మోడీకి వివరించారు.
తుపాను ప్రభావం రాష్ట్రంపై మరీ ముఖ్యంగా కోస్తాపై తీవ్రంగా ఉంటుందని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరించిన సంగతి తెలిసిందే. తుపాను మంగళవారం సాయంత్రం లేదా రాత్రికి కాకినాడ సమీ పంలో తీరం దాటే అవకాశాలున్నాయి. అయితే ఇప్పటికే కోస్తా వ్యాప్తంగా తుపాను ప్రభావం కనిపిస్తోంది. తీర ప్రాంతంలో బలమైన ఈదురుగాలులతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. సముద్రం అల్లకల్లోలంగా మారింది. ఇప్పటికే చాలా చోట్ల వర్షాలు ప్రారంభమయ్యాయి. మంగళవారం, బుధవారం (అక్టోబర్ 28, 29) పరిస్థితి మరింత తీవ్రంగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది.