సామాను సర్దుకుంటున్న ప్రధాని మన్మోహన్
posted on May 13, 2014 @ 5:53PM
దేశ ప్రధాని మన్మోహన్‌సింగ్ ఇంకో నాలుగు రోజుల్లో ప్రధాని సీటు ఖాళీ చేసి వెళ్ళిపోవడానికి సిద్ధమవుతున్నారు. ప్రధాని అధికార నివాసాన్ని ఖాళీ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. అలాగే ప్రధానమంత్రి కార్యాలయంలో కూడా మన్మోహన్ సింగ్‌కి చెందిన వ్యక్తిగత సామాను కూడా మూటగట్టి రెడీగా వుంచారు. ఈ నేపథ్యంలో ప్రధాని మన్మోహన్ తన కార్యాలయంలో తన వ్యక్తిగత సిబ్బందితో వీడ్కోలు సమావేశం జరిపారు. ఈ సమావేశంలో 110 మంది ప్రధాని వ్యక్తిగత సహాయ సిబ్బంది, 400 మంది కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. వీరందరిని మన్మోహన్ వ్యక్తిగతంగా కలసి తనతో కలసి పనిచేసినందుకు థాంక్స్ చెప్పారు. ప్రధాని కార్యలయం సిబ్బంది కరతాళ ధ్వనులతో మన్మోహన్‌కి వీడ్కోలు పలికారు. మన్మోహన్ సింగ్ శనివారం నాడు తన చిట్టచివరి కేబినెట్ మీటింగ్‌లో పాల్గొంటారు. ఆ తర్వాత రాష్ట్రపతిని కలిసి, అనంతరం దేశ ప్రజలని ఉద్దేశించి ప్రసంగించి, ఆ తర్వాత కొత్త ప్రభుత్వానికి అవకాశం ఇస్తూ ప్రధాని బాధ్యతల నుంచి తప్పుకుంటారు.