గతంలో జరిగిన గాయాలు ఏవైనా సరే ? ఆ గాయాల నుండి ఇలా బయటపడండి..!

 

ప్రజలు చాలావరకు మానసిక సమస్యలతోనే  ఎక్కువగా డిస్టర్బ్ అవుతారు.   చాలామందిని గమనిస్తే కాలంతో పాటు అలా సాగుతుంటారు.. కానీ వారిలో మానసిక సమస్యలు అలాగే ఉంటాయి.  అవన్నీ గతంలో జరిగిన గాయాల తాలూకు బాధాకర పరిస్థితులు.  కాలం అయితే గడుస్తోంది కానీ.. మానసికంగా ఒకచోటే చిక్కుబడిపోయి ఉంటారు. ఆ గాయపడిన పరిస్ఖితుల నుండి బయటకు రాలేకపోవడం వల్లనే చాలా వరకు డిప్రెషన్ వంటి సమస్యలకు లోనవుతుంటారు.  అయితే గతం చేసిన గాయాలు తగ్గంచలేనివే అయినా వాటి నుండి బయటపడం చాలా అవసరం. లేకపోతే జీవితంలో ఎదుగుదల అంతగా ఉండదు.  మానసికంగా బలహీనంగా ఉన్నవారు దాన్ని అధిగమించాలంటే ఈ గతం తాలూకు గాయాల నుండి బయటపడాలి.


గతంలో జరిగిన గాయాలు ఏవైనా సరే.. వాటి నుండి బయటపడటం చాలా ముఖ్యం.  ఈ మానసిక గాయాలు మనిషిని లోపలి నుండి చాలా బలహీనంగా మారుస్తాయి.  దీని కారణంగా వ్యక్తులు ఎప్పుడూ నిరాశ,  ఆందోళన, మనుషుల మీద నమ్మకం లేకపోవడం వంటి సమస్యలతో ఇబ్బంది పడాల్సి వస్తుంది.

గతం తాలూకు గాయాలతో ఇబ్బంది పడుతున్నవారిలో ఎమోషన్స్ ఎక్కువగా ఉంటాయి.  ఇవి వ్యకులలో తొందరగా కోపం, విచారం,  భయం వంటివి కలిగిస్తుంటాయి.  ఈ ఎమోషన్స్ ను బయట పెట్టలేక,  మనసులోనే అణుచుకోలేక చాలామంది ఇబ్బంది పడుతుంటారు. అయితే ఎమోషన్స్ ను అణుచుకోవడానికి ప్రయత్నించకూడదు.  వీటిని బయటకు వ్యక్తం చేయడం వల్ల మనసులో భారం ఏర్పడదు.

కౌన్సెలింగ్..

కౌన్సెలింగ్ తీసుకోవడం వల్ల మనసులో మానసిక బాధను, గాయాల తాలూకు పరిస్థితులను అధిగమించడం సులువు అవుతుంది.  గాయం తాలూకు ప్రభావాన్ని తగ్గించుకోవచ్చు.

సహకారం..

కుటుంబ సభ్యులు, స్నేహితులు,  ఆప్తుల సహాయంతో  మానసిక గాయాల నుండి బయట పడేందుకు ప్రయత్నించాలి.  చుట్టూ ఉన్నవారి సపోర్ట్ ఉంటే వీటి నుండి బయటపడటం తేలిక. వాతావరణాన్ని చాలా ఆహ్లాదంగా ఉంచడంలో అందరూ సహాయపడతారు.

నిద్ర..

మానసిక సమస్యలకు మంచి ఔషదంగా నిద్రను చెప్పవచ్చు.  రోజూ కంటినిండా నిద్రపోవడం,  సమతుల ఆహారం తీసుకోవడం వల్ల మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది.  మానసిక సమస్యలు ఏర్పడినా అవన్నీ తర్కంగా,  ఆలోతనాత్మకంగా పరిష్కరించుకోగలుగుతారు.  శరీరంలో ఒత్తిడి తగ్గించుకోవడం చాలా ముఖ్యం.

సెల్ఫ్ నోట్..

మనసులో ఉన్న భావాలను,  మనసు పడే బాధను అక్షరరూపంలో రాస్తుంటే మనసు భారం చాలా వరకు తగ్గుతుంది.  వీటిని ఇలా రాస్తూ ఉంటే ఆ తరువాత ఎప్పుడైనా పునఃపరిశీలన చేసుకున్నప్పుడు ఆలోచనల పరంగా మారడానికి చాలా ఉపయోగపడతాయి.  అప్పట్లో నేను ఇలా ఉన్నాను, ఇప్పుడెందుకు ఇలా అయ్యాను.. అప్పట్లో ఇంత బాధలో ఉన్నాను.. ఇప్పుడు ధైర్యంగా ఉన్నాను.. ఇలాంటి మాటలు మనసుకు చాలా ఊరట ఇస్తాయి.

హాబీ..

మానసిక సమస్యల నుండి, గతం గాయాల నుండి బయట పడాలంటే దానికి చక్కని మార్గం మనసుకు, మెదడుకు ఆలోచించే అంత సమయం ఇవ్వకపోవడం.  ఇందుకోసం  కొత్త పనులు, హాబీలు,  కొత్త విషయాలు నేర్చుకోవాలి.  దీని వల్ల రెండు లాభాలున్నాయి.  ఒకటి గతం గాయాలు మర్చిపోవడం, రెండవది కొత్త నైపుణ్యాలు సాధించడం ద్వారా జీవితంలో  ఆర్థిక భద్రతవైపు అడుగేయడం.  


                                    *రూపశ్రీ.