శిరోముండనం బాధితుడి లేఖ పై సీరియస్ గా రియాక్టయిన రాష్ట్రపతి
posted on Aug 12, 2020 @ 3:52PM
ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా సీతానగరం పోలీసులు ఒక దళిత యువకుడికి శిరోముండనం చేసిన ఘటనపై భారత రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ సీరియస్ గా స్పందించారు. ఈ మొత్తం ఘటనపై విచారణ జరిపేందుకు ఒక ప్రత్యేక అధికారిని నియమించారు. ఆంధ్రప్రదేశ్ పరిపాలన విభాగానికి ఈ కేసుకు సంబంధించిన ఫైల్ బదిలీ చేస్తూ ఏపీ జీఏడీ అసిస్టెంట్ సెక్రటరీ జనార్ధన్ బాబును కలవాలని బాధితుడు ప్రసాద్ కు రాష్ట్రపతి కార్యాలయం సూచించింది. ఈ కేసుకు సంబంధించిన కాల్ రికార్డ్స్, వీడియో క్లిప్పింగులతో కూడిన పూర్తి వివరాలు జనార్దన్ బాబుకు అందించాలని బాధితుడు ప్రసాద్ కు రాష్ట్రపతి భవన్ తెలిపింది.
కొద్దీ రోజుల క్రితం తనకు శిరోముండనం చేసిన ఘటనలో ముఖ్య కారణమైన వ్యక్తులపై రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో బాధితుడు ప్రసాద్ నేరుగా రాష్ట్రపతికి లేఖ రాశారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో తనకు న్యాయం జరుగుతుందనే నమ్మకం లేదని దాంతో రాజ్యాంగ వ్యవస్థపై నమ్మకాన్ని కోల్పోతున్నానని.. మావోయిస్టుల్లో చేరి తన పరువు కాపాడుకుంటానని దానికి అనుమతివ్వాలని ఆ లేఖలో పేర్కొన్నాడు. ఐతే బాధితుడి లేఖ అందుకున్న 24 గంటల్లోనే రాష్ట్రపతి కార్యాలయం స్పందించడం గమనార్హం.