ఇక ఏడాదికి మూడు నెలలే విద్యుత్!
posted on Mar 2, 2013 @ 9:36AM
నిండా మునిగినవాడికి చలేమిటనట్లు ఉంది మన ప్రభుత్వం పని తీరు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి విద్యుత్ చార్జీలు పెంపు తప్పనిసరి అని ఖరాఖండిగా ప్రకటించిన తరువాత అందుకు రాష్ట్ర విద్యుత్ సంస్థే బాధ్యురాలు తప్ప తమ ప్రభుత్వం కాదని చెప్పారు. విద్యుత్ బిల్లులపై సర్ చార్జి విదింపు నిర్ణయం కూడా తనది కాదని, అది రాష్ట్ర విద్యుత్ సంస్థ నిర్ణయం అని చెప్పి చేతులు దులుపుకొన్నారు.
ఆవు చేలో మేస్తే దూడ గట్టున ఎందుకు మేస్తుంది? ముఖ్యమంత్రి మాటలతో ప్రేరణ పొందినట్లు పీసీసీ అధికార ప్రతినిధి తులసిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ వరుణుడు కరుణిస్తే జులై నెలకి కరెంటు కష్టాలు తీరే అవకాశం ఉందని లేదంటే ఈ ఏడాది నవంబర్ వరకు విద్యుత్ కోతలు తప్పవని గొప్పగా ప్రకటించారు. అంటే, రాష్ట్రంలో కేవలం ఏడాదికి మూడు నెలలు మాత్రమే నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయగలమని చెప్పడం అన్నమాట.
గత సంవత్సరం నవంబర్ నుండి ఈ ఏడాది జనవరి 20వ తేదీ వరకు (నగరాలలో మాత్రమే) కోతలు లేకుండా విద్యుత్ సరఫరా చేసిన మన విద్యుత్ సంస్థలు ఆ తరువాత నుండి అనధికార కోతలు మొదలు పెట్టడం అందరూ ఎరిగినదే. అయితే ఇప్పుడు ఆ కోతలను మర్చి 1వ తేదీ నుండి అమలు చేస్తున్నట్లు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించడం ప్రజలను అపహాస్యం చేయడమే తప్ప మరొకటి కాదు. ఈ ప్రకటన సరిపోదన్నట్లు, ఇప్పుడు ముఖ్య మంత్రి, తులసిరెడ్డిల ప్రకటనలు ఆ పుండు మీద కారం చల్లినట్లే అవుతుంది.
మన రాజకీయ నాయకులకి రాజకీయాలపై ఉన్న శ్రద్ధ రాష్ట్ర అభివృద్దిపై లేకపోవడమే ఒక కారణమయితే, హైదరాబాదును అభివృద్ధి చేస్తే, రాష్ట్ర అభివృద్ధి చేయడమేననే మరో వింత ధోరణి నేటి ఈ పరిస్థికి మరో కారణం. రాష్ట్ర అభివృద్దిపట్ల ఎటువంటి సుదీర్ఘ ప్రణాళిక కానీ, అవగాహన కానీ లేకుండారోజులు లెక్కబెట్టుకొంటూ రాజకీయాలు చేసుకొంటూ కాలక్షేపం చేస్తోంది మన ప్రభుత్వం.
ఆశ్చర్యకరమయిన సంగతి ఏమిటంటే, ప్రధాన ప్రతిపక్షాలు మూడు కూడా ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు అర్ధమయ్యేలా వివరిస్తూ, ప్రభుత్వ అసమర్ధత గురించి ప్రజల మనస్సులో నాటుకుపోయేలా విడమరిచి చెప్పుతున్నపటికీ, ప్రభుత్వం జంకు గొంకూ లేకుండా ఈ విదంగా నిర్భయంగా ఉండగలడం విశేషం. ఈ నేపద్యంలో త్వరలో ఎన్నికలు ఎదుర్కోవలసి ఉంటందని ఎరిగినప్పటికీ రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం ఈ విదంగా ప్రజలతో ఆడుకోవడం చూస్తే బహుశః వచ్చే ఎన్నికలలో తమ ఓటమి ఖాయం అని కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం పూర్తి విశ్వాసంతో ఉన్నట్లు అర్ధం అవుతుంది. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిపై తీవ్ర ప్రభావం చూపే విద్యుత్ సమస్యపట్ల ప్రభుత్వం ఇంత ఉదాశీనంగా ఉండగలగడం, నిర్లజ్జగా తన అసమర్ధతను సమర్దించుకోవడం చూస్తుంటే, కాంగ్రెస్ తన భవిష్యత్తుకు తానే మంగళం పాడుకొన్నట్లు ఉంది.