పూరీ జగన్నాథుని సెల్ఫ్ క్వారంటిన్!
posted on Mar 25, 2020 @ 8:36PM
ప్రపంచ ప్రఖ్యాత పూరీ క్షేత్రంలో జగన్నాధస్వామి వారు ఏటా జ్వరం బారిన పడతారు. దీని వ్యాప్తి జరగకుండా స్వామివారు సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తారు. జగన్నాధ రధయాత్రలో స్నానం చేసినపుడు స్వామి వారికి వచ్చేది వైరల్ ఫీవరేనని, అది భక్తులకు అంటకుండా స్వామి ఏకాంతంలోకి వెళ్లాడనీ భావించాలి. అది కూడా 14 రోజులే కావటం విశేషం!
స్నానపూర్ణిమలో 108 కుండల నీటిలో జలకాలాడిన జగన్నాథునికి జ్వరం వస్తుంది. ఆనాటి నుంచి రెండువారాల పాటు పూరీ ఆలయంలో భక్తులకు మూలవిరాట్టుల దర్శనం ఉండదు. మూలవిరాట్ల స్థానంలో సంప్రదాయక 'పొటొచిత్రో' పద్దతిలో పెద్దవస్త్రంపై చిత్రించిన విగ్రహాల రూపాలనే దర్శించు కోవాల్సి ఉంటుంది. ఈ రెండువారాల కాలంలో జగన్నాథుని మూలవిరాట్టుకు ఛప్పన్న (యాభై ఆరు) భోగాల నైవేద్యం కూడా నిలిచిపోతుంది. జ్వరపీడితుడైన జగన్నాథునికి ఔషధ మూలికలు, ఆకులు, కషాయాలు, కొన్ని పండ్లను మాత్రమే దైతాపతులు సమర్పిస్తారు. జగన్నాథుని తొలుత ఆరాధించిన గిరిజన రాజు విశ్వవసు కూతురు లలిత, బ్రాహ్మణ పూజారి విద్యాపతిల వారసులే దైతాపతులు. జగన్నాథుని ఆరాధనలో వీరికి విశేష అధికారాలు ఉంటాయి. జ్వరపీడితుడైన జగన్నాథునికి పథ్యపానాలు సమర్పించేది ఈ దైతాపతులు మాత్రమే. అంటే వీరు శానిటైజర్లు ఉన్నవారు లేదా ఇమ్యూనిటీ కలవారునేమో? రథయాత్ర వేడుకలు ముగిసేంత వరకు వీరి ఆధ్వర్యంలోనే జగన్నాథుని పూజాదికాలు జరుగుతాయి. జగన్నాథునికి జ్వరం తగ్గేలోగా రథాల తయారీ, వాటి అలంకరణ పూర్తవుతుంది.