జగన్‌తో పొంగులేటి భేటీ.. తెరవెనక కమలం?
posted on Feb 11, 2023 9:02AM
మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి రాజకీయ నాయకుడు మాత్రమే కాదు. వ్యాపార వేత్త కూడా. అందుకే ఆయన రాజకీయంగా వేసే ప్రతి అడుగు వెనుక రాజకీయ ప్రయోజనాలతో పాటు వ్యాపార ప్రయోజనాలను కూడా బేరీజు వేసుకోవడం కనిపిస్తుంది. అందుకే ఆయన అధికార బీఆర్ఎస్ తో తెగతెంపులు చేసుకున్నా, ఇంత వరకు ఆ పార్టీకి రాజీనామా చేయలేదు. అలాగని పార్టీలో ఉన్నారా అంటే అదీ లేదు. పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండడమే కాదు, వ్యతిరేకంగా పోతున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తనను మోసం చేశారని, ఆశ చూపి అవమానాలకు గురి చేశారని తీవ్ర ఆరోపణలు చేశారు.
అంతే కాదు దమ్ముంటే తనను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని బీఆర్ఎస్ నాయకత్వాన్ని సవాలు చేస్తున్నారు. మరో వంక బీఆర్ఎస్ నాయకులు పొంగులేటి పార్టీకి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారే కానీ ఆయన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేసే సాహసం చేయలేక పోతున్నారు. అంటే ఖమ్మం జిల్లాలో ఆయన బలమేమిటో, జిల్లా రాజకీయాలపై ఆయన కున్న పట్టు ఎంతో వేరే చెప్పనక్కర లేదు. ఆయన బలమైన రాజకీయ నాయకుడు, బలమైన వ్యాపార వేత్త... రాజకీయాలను శాసించే అంగబలం, ఆర్థిక స్థోమత ఉన్న నాయకుడు.
అయితే, అంతటి బలవంతుడు తమ రాజకీయ భవిష్యత్ విషయంలో ఎందుకు తడబాటు పడుతున్నారు. ఎందుకు ఎటూ తేల్చుకోలేకుండా ఉన్నారు? అంటే అందుకు ఇదీ కారణమని చెప్పడం కొంచెం చాలా కష్టమే, కానీ, ఏదో ఒక బలమైన కారణం లేకుండా ఆయన ఇన్ని ఆలోచనలు చేయరని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అందులో రాజకీయ వ్యూహాలు ఎత్తుగడలతో పాటుగా వ్యాపార వ్యవహారాలు, లావాదేవీలు కూడా ఉంటాయని అందుకే ఆయన ఆచితూచి అడుగులు వేస్తున్నారని అంటున్నారు.
బీఆర్ఎస్ కు ‘బ్రేకప్’ చెప్పిన తర్వాత ఆయన ఫస్ట్ లవ్ బీజేపీ. ఆయన బీజేపీలో చేరుతున్నారనే ప్రచారం బలంగా సాగింది. ముహూర్తాలూ ఖరారయ్యాయి. అయితే, అది జరగలేదు. కాంగ్రెస్ లో చేరే విషయంలోనూ అంతే.. ఆ తర్వాత వైఎస్సార్టీపీలో చేరుతున్నట్లు ప్రచారం జరిగింది. వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలతో, ఆ తర్వాత వైఎస్ సతీమణి విజయమ్మతో ఆయన భేటీ అయ్యారు. ఈ నేపద్యంలోనే ఆయన వైఎస్సార్ టీపీలో చేరిక లాంఛనమే.. అనే ప్రచారం జరిగింది.
అయితే వైఎస్ఆర్ టీపీలో చేరబోతోన్నారంటూ ప్రచారం ఊపందుకుంటోన్న వేళ.. పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో ప్రత్యక్షం అయ్యారు. జగన్మోహన్ రెడ్డితో భేటీ అయ్యారు. వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ ప్రజా వ్యవహారాల సలహదారు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ఈ భేటీలో పాల్గొన్నట్లు తెలుస్తోంది. వైఎస్ కుటుంబం, వైఎస్ జగన్ తో ఉన్న వ్యక్తిగత అనుబంధంతోనే ఆయనను కలిశారని చెపుతున్నారు. నిజానికి వైఎస్ కుటుంబంతో పొంగులేటికి సన్నిహత సంబంధాలు ఉన్న మాట నిజం, రాజకీయాలకు అతీతంగా ఆయన వైఎస్ కుటుంబాన్ని అభిమానిస్తున్నారనేది కూడా నిజమే కావచ్చును. రాష్ట్ర విభజన అనంతరం జరిగిన ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఖమ్మం లోక్ సభకు పోటీ చేసి గెలిచారు. ఖమ్మం లోక్ సభ పరిధిలో రెండు అసెంబ్లీ స్థానాలను కూడా గెలిపించుకోగలిగారు.
ఇప్పుడు ఆ పాత బంధాలను పెనవేసుకునే క్రమంలోనే ఆయన జగన్ రెడ్డిని కలిశారా? లేక ఇంకేమైనా సీక్రెట్ కనెక్షన్ ఉందా? అనేది తేలవలసి వుందని అంటున్నారు. అయితే, జగన్ రెడ్డికి బీజేపీ అగ్రనాయకులతో ఉన్న సంబంధాల కోణం నుంచి కూడా ఈ భేటీని చూడవలసి ఉంటుందని ఆ కోణంలోనూ ఆలోచించవలసి ఉంటుందని అంటున్నారు. పొంగులేటి మీద బీజేపీ రాష్ట్ర నాయకత్వమే కాదు, పార్టీ అగ్ర నేతలు మోదీ, అమిత్ షా కూడా ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఆ ఇద్దరిలో ఎవరో ఒకరి సమక్షంలో అది కుడా భారీ బహిరంగ సభ వేదికగా పార్టీలో చేర్చుకోవాలని, తద్వారా పార్టీలో జోష్ పెంచాలని ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. ఇప్పుడు పొంగులేటి చెయ్యి ఇవ్వడంతో మోడీ షా జోడీ ఇష్యూని సీరియస్ గా తీసుకుని జగన్ రెడ్డిని రంగంలోకి దింపారని అంటున్నారు. పొంగులేటిని పార్టీలోకి పార్టీలోకి తెచ్చుకునేందుకు కమల నాథులు జగన్ రెడ్డిని ప్రయోగించరా? అనే అనుమానాలు కూడా వ్యక్త మవుతున్నాయి. అయితే నిజం ఏమిటన్నది ... పొంగులేటి అంతిమ నిర్ణయం ఏమిటో తెలిస్తేనే కానీ, ప్రపంచానికి తెలియదు.