మెగాస్టార్ మా..వాడే !
posted on Jan 21, 2023 @ 4:26PM
మెగాస్టార్ చిరంజీవి తేల్చి చెప్పేశారు, రాజకీయాలకు శాశ్వతంగా గుడ్’బై చెప్పేశానని స్పష్టం చేశారు. ఏపీ రాజకీయాల గురించి అయితే తనకు ఏమీ తెలియదని, తన ఓటు తెలంగాణలో ఉందని, ఏపీ రాజకీయాలతో నాకేటి పని అన్నట్లుగా చేతులు కడిగేసుకున్నారు.
అయినా, "గాడ్‌ఫాదర్" సినిమాలో ఆయనే చెప్పిన రాజకీయాల నుంచి నేను దూరంగా ఉంటున్నా... నా నుంచి రాజకీయాలు దూరం కాలేదు అనే డైలాగులో లాగా ఆయన రాజకీయాలను వదిలేసినా, రాజకీయాలు ఆయన్ని వదలడం లేదు.ఆయన రాజకీయాలకు దూరంగా ఉన్నా.. అప్పుడప్పుడు ఆయన రాజకీయ తెర మీద కూడా దర్శనమిస్తున్నారు. ఆయన ‘ప్రత్యక్ష’ ప్రమేయం లేకుండానే ఆయన చుట్టూ రాజకీయ చర్చ అల్లుకుంటోంది. (అయితే చిరంజీవి తమ సినిమా ప్రచారానికి ఇలా రాజకీయాలు ఉపయోగించుకుంటారని, అనుమానించేవారు లేక పోలేదు. గతంలో ‘గాడ్ ఫాదర్’ రిలీజ్’కు ముందు. గుట్టుచప్పుడు కాకుండా ఆ సినిమాలోని "రాజకీయాల నుంచి నేను దూరంగా ఉంటున్నా... నా నుంచి రాజకీయాలు దూరం కాలేదు" అనే పది సెకండ్స్’ ఆడియోను సోషల్ మీడియాలో వదిలారు. ఆ పది సెకండ్ల ఆడియో, సినిమా ప్రచారానికి చక్కగా ఉపయోగించిందని అంటారు).
తాజాగా ఇప్పుడు, ‘వాల్తేరు వీరయ్య’ నడుస్తున్న సమయంలో మళ్ళీ మరోమారు చిరంజీవి అందరివాడు అవునా కాదా అనే చర్చ,తెర మీదకు వచ్చింది. ఆయన ఇంకా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారని, ఏపీ పీసీసీ కొత్త అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు చేసిన వ్యాఖ్యలు పాత చర్చను కొత్తగా తెరమీదకు తెచ్చాయి.అంతేకాదు, రుద్రా రాజు, ఇంకో ప్రకంపనం కుడా సృష్టించారు.చిరంజీవి ఇంకా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కాబట్టే రాహుల్ గాంధీకి లేఖ రాశారని చిరు చర్చకు మెగా టచ్’ ఇచ్చారు. అయితే ఆలేఖ ఆయన ఎప్పుడు రాశారో, ఆ లేఖలో ఏముందో మాత్రం ఆయన చెప్పలేదు. తాంబూలాలు ఇచ్చేశా తన్నుకు చావండి అన్నట్లు, ఊహాగానలకు గేట్లు మాత్రం బార్లా తెరిచారు.
ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్’లో విలీనం చేశాక చిరంజీవి రాజ్యసభ సభ్యునిగా, కేంద్ర మంత్రిగా ఉన్నారని రుద్రరాజు పేర్కొన్నారు. ఇప్పుడు రాజకీయాలకు దూరంగా ఉంటూ సినిమాలపై పూర్తి ఫోకస్ పెట్టారని అన్నారు. కాగా కొన్ని రోజుల క్రితం రాజకీయాలకు నేను పూర్తి దూరంగా ఉన్నానని చిరంజీవి) పేర్కొన్నారు. ఈ క్రమంలో ఏపీ పీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశం అయ్యాయి.
అయితే, చిరంజీవి స్కండ్ ఇన్నిగ్స్’లోనూ మెగా స్టార్’గ దూసుకుపోతున్నారు. యంగ్ హీరోలతో సమానంగా సినిమాలు చేస్తున్నారు.జనం చూస్తునారు. ఉతీవల విడుదలైన ‘వాల్తేరు వీరయ్య’ కలెక్షన్స్ దూసుకుపోతున్నాయి. చిరంజీవి ఇప్పడు ఆ సక్సెస్’ను ఎంజాయ్ చేస్తున్నారు. మరోవైపు భోళా శంకర్ సినిమాను పట్టాలెక్కిస్తున్నాడు. అయితే, ఎన్నికలు సమీపిస్తున్న నేపధ్యంలో, చిరంజీవి రాబోయే రోజుల్లో ఎలాంటి స్టెప్ తీసుకుంటారనేది ఇప్పుడు మరోసారి చర్చకు వచ్చింది.