మోదీ, షా చదరంగ ప్రావీణ్యం
posted on Jul 23, 2022 @ 4:22PM
రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులూ ఉండరు. అలాగని ఒకరికొకరు ఒకే పన్నాముక్కలానూ కలిసి ఉండరు. తెర మీద కావలించుకున్న ఇద్దరూ తెర వెనుక ఆవల కొట్టుకు ఛస్తారన్నారు పూర్వం ఓ కవి. ఎవ్వరయినా, ఎవరితోనైనా సఖ్యత నటించ డమే.. ప్రయాణ లక్ష్యం వేరే ఉంటుంది. ఇపుడు మోదీ, మమతా దీ స్నేహం భావం అదే. ఇద్దరూ నిజానికి ఎడ మొగం పెడమొగం. కానీ శతృవును ఎంచుకున్నాక చూసుకోవడాలు, నవ్వుకోవడాలు, ఆనక పెరట్లో పావులు కదపపడాలు మామూలే.
మోదీ ప్రభుత్వానికి విపక్షంలోనూ తామే ఉండాలన్న చిత్రమైన కోరిక మమతా దీది. ఒక్కసారైనా ప్రధాని కావాలన్న తలంపు ఆమెది. దేశంలో ప్రధాన ప్రతిపక్షాన్ని మోదీగారు అనుకోగానే తొక్కేయడం చాలా కష్టం. అందుకు తగిన పదునైన తిక్క అస్త్రం ఒకటి కావాలి కనుక బెంగాలీ చెల్లి మమతాదీని ఎగదోయడంమే మార్గం అనుకున్నారాయన. ఆమె కూడా తన అవసరం కోసం మోదీ ముక్త భారత్ కీ జై అనే అనాలి. కనుక వైరుధ్యాలు తెరమీద చూపుతూ తెర వెనుక ఊహించని మలుపులతో చిర్నవ్వులు చిందిస్తూ మనం ఒకటే కలిసి పోరాడదాం అని అందరికీ టోపీ పెట్టే వ్యూహాలతో ఉన్నారు.
బీజేపీతో కర్రా విరక్కుండా పాము చావాకూడదన్న తీరులో మమతా బెనర్జీ వ్యవహరిస్తున్నారు. ఆమెను భ్రమలోనే ఉంచామని బేజీపీ అనుకుంటోంది, తాను ఉపరాష్ట్రపతి అభ్యర్ధి విషయంలో తనను విశ్వాసంలోకి తీసుకోలేదన్న ఉక్రోషంతో ఆమె దూరంగా ఉంటున్నారు. అందువల్ల వీరి ఐక్యత గాలివాటుకు పడే కర్రలాంటిది. పైగా మార్గరెట్ అల్వా అభ్యర్ధిత్వాన్ని కాంగ్రెస్ ప్రకటిం చింది కానీ అదేమంత విజయాన్ని ఇవ్వకపోవచ్చు. వాస్తవానికి మార్గరెట్ మీద సోనియాకు ప్రత్యేకించి ప్రేమ లేదు. ఎవరూ లేక పేరు ప్రకటించినట్లే అయింది, కనుక నవీన్ పట్నాయక్ తదితరులు మళ్లీ బీజేపీ అభ్యర్ధికే మద్దునిస్తారు. అంటే రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి అభ్యర్దులను గెలిపించుకోవడంలో, తమకు భవిష్యత్‌లో అనుకూలించేవారినే పీఠం ఎక్కించడంలో కమలనాథుల వ్యూహం ఫలించినట్టే.
ఆప్ పార్టీ ఎంపిక భేటీకి డుమ్మా కొట్టేసింది. వెరసి యశ్వంత్ సిన్హాలాగే మార్గరెట్‌ను కూడా ఘోరంగా ఓడిపోయే ప్రణాళికను బీజేపీ అమలు పరుస్తోంది. అందులో మొదటి సూచిక మమత వోటింగుకు దూరంగా ఉంటామనే ప్రకటన! ఢిల్లీ సర్కిళ్ల ప్రచారం మేరకు మొన్న మంత్రి పదవికి రాజీనామా చేసిన ముక్తార్ నక్వీని బెంగాల్ గవర్నర్‌గా చేస్తే మమతను శాంత పరిచినట్టే అవు తుంది. నక్వీ హుందాగా ఉంటారు. తన వ్యవహారశైలి, రాబోయే సాధారణ ఎన్నికల్లో బెంగాల్లో టీఎంసీ, బీజేపీ అభ్యర్థుల ఎంపిక చాలా ప్రణాళికబద్ధంగా జరగబోతోంది. కనుక బెంగాల్ టైగర్‌ను ఆట్టే గోలచేయకుండా దువ్వడంలో మోదీ, షా చదరంగ ప్రావీణ్యం గొప్పదే!