విశాఖలో మైండ్ గేమ్.. ఓటర్లు ఎటు వైపు?
posted on Mar 4, 2021 @ 10:47AM
విశాఖ కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీ పరాజయం ఖాయంగా కనిపిస్తోంది. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణలో అధికార పార్టీ వైఖరిపై ప్రజలు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. జీవీఎమ్సీ ఎలక్షన్స్ లో ఫ్యాన్ పార్టీ కి గట్టి బుద్ధి చెప్పేందుకు ఓటర్లు సిద్ధమయ్యారు. కార్మికుల పక్షాన విశాఖ ఉక్కు హక్కు కోసం పోరాడుతున్న టీడీపీకి ప్రజా మద్దతు రోజురోజుకీ భారీగా పెరుగుతోంది. అధికార పార్టీపై ప్రజలో ఉన్న ఆగ్రహాన్ని గుర్తించిన వైసీపీ ఇంఛార్జ్ విజయసాయిరెడ్డిలో కంగారు పెరిగింది. అందుకే, జనాలను కన్ఫ్యూజ్ చేసేందుకు గంటా ఎపిసోడ్ ను మరోసారి తెరమీదకు తీసుకొచ్చారని అంటున్నారు.
విశాఖ ప్రజలపై సామ, ధాన, భేద, దండోపాయాలు ప్రయోగిస్తున్నారు ఎంపీ విజయసాయిరెడ్డి. ఎన్నికలకు ముందు నుంచే టీడీపీ టార్గెట్ గా అభివ్రుద్ధి పేరుతో అరాచకాలు మొదలుపెట్టారని అంటున్నారు. గీతం వర్సిటీ నిర్మాణాలను కూలగొట్టారు. భీమిలి రోడ్డులో గంటా అనుచరుడు బొడ్టేటి కాశీ విశ్వనాథం నిర్వహిస్తున్న గోకార్టింగ్‌ను నాలుగు నెలల క్రితం షెడ్లతో సహా కూల్చివేశారు. ఆ టార్చర్ తట్టుకోలేక కాశీ విశ్వనాథం విజయసాయిరెడ్డి సమక్షంలో వైసీపీ కండువ కప్పేసుకుని ఊపిరి పీల్చుకున్నారు. గంటా శ్రీనివాసరావు ప్రధాన అనుచరుడిని దారికి తెచ్చుకున్నాక.. ఇక గంటాపై ఫోకస్ పెట్టారు విజయసాయిరెడ్డి. ఆయన త్వరలోనే వైసీపీలో చేరుతున్నారని, సీఎం జగన్ ముందు కొన్ని కండీషన్స్ పెట్టారంటూ బహిరంగంగా వ్యాఖ్యానించారు. ఇక అంతే గంటా పార్టీ మారుతున్నారంటూ ప్రచారం మొదలైపోయింది. టీడీపీ శ్రేణుల్లో అయోమయం. విజయసాయికి కావలసిందీ ఇదే. జరుగుతున్న నష్టాన్ని వెంటనే గుర్తించిన గంటా.. తాను వైసీపీలో చేరడం లేదంటూ వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. జగన్ ముందు తాను పెట్టిన కండీషన్స్ ఏంటో చెప్పాలంటూ విజయసాయిని డిమాండ్ చేశారు. గంటా కామెంట్లకు మళ్లీ విజయసాయి నుంచి కౌంటర్ వచ్చింది. ఇలా జీవీఎమ్సీ ఎన్నికలకు ముందు ఇద్దరి నేతల మధ్య డైలాగ్ వార్ తో విశాఖ ఓటర్లు కన్ఫ్యూజ్ అవుతున్నారు. అసలు, గంటా టీడీపీలో ఉంటున్నారా? వైసీపీలో చోరుతున్నారా? అంటూ డైలమాలో పడ్డారు. ఇప్పటికే టీడీపీకి ఓటు వేయాలని ఫిక్స్ అయిన ఓటర్లంతా గంటా ఎపిసోడ్ తో వారిలో గందరగోళం నెలకొంది. ఇదంతా విజయసాయిరెడ్డి ఆడుతున్న మైండ్ గేమ్ అంటున్నారు టీడీపీ నేతలు.
గంటా తీరు సైతం ఈ గందరగోళానికి ప్రధాన కారణం. రెండేళ్లుగా మౌనంగా ఉంటూ, టీడీపీకి దూరంగా ఉంటూ.. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణతో ఒక్కసారిగా ప్రజాక్షేత్రంలో మళ్లీ యాక్టివ్ అయ్యారు గంటా శ్రీనివాసరావు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి విశాఖ ఉక్కు ఉద్యమానికి ఊపు తెచ్చారు. టీడీపీ ఆధ్వర్యంలో విశాఖ ఉక్కు కోసం పెద్ద ఎత్తున పోరాటం జరుగుతోంది. టీడీపీ నేత గంటా అందులో ముందున్నారు. ఇదంతా అధికార పార్టీలో కలవరానికి కారణమైంది. వైజాగ్ లో టీడీపీ జోరు పెరగడం.. పసుపు జెండా నీడనే ఉక్కు ఉద్యమం ఎగిసిపడుతుండటంతో.. జీవీఎమ్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ప్రభంజనం ఖాయంగా కనిపిస్తోంది. అందుకే, గంటా పేరుతో మైండ్ గేమ్ ఆడుతూ టీడీపీ కేడర్ ను కకావికలం చేసే ప్రయత్నం విజయసాయిరెడ్డి చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.
రాజధాని పేరుతో కొంతకాలంగా అధికార పార్టీ చేస్తున్న ఆగడాలతో విశాఖ ప్రశాంతత చెదిరిందనే విమర్శ వినిపిస్తోంది. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణలో వైసీపీ పెద్దల హస్తం ఉందనే ఆరోపణ ఆ పార్టీకి మరింత డ్యామేజ్ చేస్తోంది. అందుకే, జీవీఎమ్సీ ఎన్నికల్లో వైసీపీకి ఓటమి తప్పదని ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే జగన్ దగ్గర విజయసాయిరెడ్డి ఇమేజ్ దారుణంగా పడిపోతోంది. ఇప్పటికే ప్రజా వ్యతిరేకతపై జగన్ కు నివేదికలు అందాయని.. విజయసాయిరెడ్డి వైఫల్యంపై జగన్ రెడ్డి సీరియస్ గా ఉన్నారని తెలుస్తోంది. అందుకే, విశాఖ కార్పొరేషన్ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని పట్టుదలతో ఉన్న విజయసాయి.. ఎన్నికలకు ముందు చివరి ప్రయత్నంగా గంటా పార్టీ మారుతున్నారంటూ మైండ్ గేమ్ తో పొలిటికల్ గేమ్ ఆడుతున్నారని అంటున్నారు. మరి, చైతన్యవంతులైన విశాఖ ఓటర్లు ఈ ఎన్నికల్లో ఎలాంటి తీర్పు చెబుతారో...