కంటోన్మెంట్ లో రాజకీయ కాక.. అక్కడ నుంచి పోటీకి బీఆర్ఎస్ లో పోటాపోటీ!
posted on Feb 22, 2023 @ 1:51PM
కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయిన్న మృతి.. అధికారిక లాంఛనాలు లేకుండా ఆయన అంత్యక్రియల వివాదం సద్దుమణగక ముందే బీఆర్ఎస్లో రాజకీయ కాక మొదలైంది. సాయన్న మృతిలో కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమన్నచర్చ నేపథ్యంలో ఆ నియోజకవర్గం నుంచి పోటీకి పార్టీలో పోటీ పెరిగింది. ఇద్దరు మంత్రుల అనుచరులు ఆ నియోజకవర్గం నుంచి పోటీకి సై అంటున్నారు. ఉప ఎన్నికకు కాకపోయినా.. ఈ ఏడాది చివరిలో జరిగే అసెంబ్లీ ఎన్నికలలోనైనా కంటోన్మెంట్ సీటు దక్కించుకోవాలన్న వ్యూహంతో ప్రణాళికలు రచిస్తున్నారు. ఎతులు వేస్తున్నారు.
కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక నిర్వహించాలా వద్దా అన్న విషయంపై నిర్ణయం తీసుకోవలసింది కేంద్ర ఎన్నికల సంఘం. ఈ విషయంలో అక్కడ నుంచి ఇప్పటి దాకా ఎలాంటి క్లారిటీ రాలేదు. ఒక వేళ ఉప ఎన్నిక నిర్వహించడమంటూ జరిగితే.. కర్నాటక అసెంబ్లీ ఎన్నికలతో పాటు కంటోన్మెంట్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరిగే అవకాశాలే మెండుగా ఉన్నాయి. ఆ అంచనాతోనే కంటోన్మెంట్ నియోజకవర్గం నుంచి పార్టీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వంలోని ఇద్దరు కీలక మంత్రుల సన్నిహితులు ప్రయత్నాలు ప్రారంభించేశారు.
మంత్రి హరీష్ రావుకు సన్నిహితుడైన ఎర్రోళ్ల ఎర్రోళ్ల శ్రీనివాస్ అలాగే కేటీఆర్ కు అత్యంత సన్నిహితంగా ఉండే క్రిశాంక్ కంటోన్మెంట్ నియోజకవర్గ పార్టీ టికెట్ కోసం తమ వంతు ప్రయత్రాలు చేస్తున్నట్లు పార్టీ శ్రేణుల్లో జోరుగా చర్చ నడుస్తోంది. సందట్లో సడేమియా అన్నట్లుగా ఇదే నియోజకవర్గం నుంచి 2014 ఎన్నికలలో బీఆర్ఎస్ (అప్పుడు టీఆర్ఎస్) అభ్యర్థిగా పోటీ చేసి అప్పట్లో తెలుగుదేశం అభ్యర్థిగా రంగంలో ఉన్న సాయన్న చేతిలో ఓడిపోయిన గడ్డం నగేష్ సైతం ఇప్పుడు తనకు బీఆర్ఎస్ తరఫున పోటీ చేసే అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. 2014లో తనపై గెలిచిన సాయన్నకే 2018 ఎన్నికలలో కేసీఆర్ పార్టీ టికెట్ ఇవ్వడంతో.. అప్పుడు త్యాగం చేసిన తనకే పార్టీ టికెట్ ఇవ్వాలని ఆయన కోరుతున్నారు.
ఈ ముగ్గురే కాకుండా సాయన్న కుమార్తె లాస్య కూడా రేసులో ఉన్నారని చెబుతున్నారు. తన తండ్రి ప్రాతినిథ్యం వహించిన కంటోన్మెంట్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా రంగంలోకి దిగే అవకాశాన్ని తనకే ఇవ్వాలని ఆమె కోరుతున్నారు.