బీఆర్ఎస్ ఎంట్రీతో ఏపీలో పొలిటికల్ క్లారిటీ?
posted on Jan 16, 2023 @ 11:25AM
ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ వాతావరణం ఇటీవలి కాలం వరకూ అత్యంత సంక్లిష్టంగా ఉండేది. ఔను అభివృద్ధీ నినాదానికీ.. సంక్షుమం ప్రలోభాలకూ మధ్య హోరాహోరీ పోరు తప్పదన్న భావన ఉండేది. అన్ని ఫ్రీ.. అంతా ఫ్రీ విధానానికీ.. కష్టపడదాం, పని చేద్దాం సంపద పెంచుదాం అన్న విజన్ కూ మధ్య పోటీ అన్న వాతావరణం ఉండేది.
అయితే ఇప్పుడు ఒక్క సారిగా రాజకీయ ముఖ చిత్రం మారిపోయింది. తెరాస బీఆర్ఎస్ గా పేరు మార్చుకుని ఏపీ గడ్డపై అడుగుపెట్టడంతో ఇక ఫ్రీ విధానానికి చెల్లు చీటీ పడిపోయింది. నిన్న మొన్నటి వరకూ అభివృద్ధి లేమి, పరిశ్రమలు పరార్ అంటూ ఏపీని చూపి తెలంగాణలో ఓట్లు దండుకున్న తెరాస ఇప్పుడు అదే అభివృద్ధి నినాదంతో ఏపీలో అడుగు పెట్టేసింది. ఏపీలో అడుగు పెట్టడానికి తెరవెనుక రాజకీయం మరేదో ఉందన్న అనుమానాలను పక్కన పెడితే.. ఆత్మగౌరవం, అభివృద్ధి అజెండాను బీఆర్ఎస్ తెరపైకి తీసుకు వచ్చింది.
అదే సమయంలో గతంలో అంటే 2014, 2019 ఎన్నికల సమయంలో అప్పట్లో తెరాసగా ఉన్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆంధ్రప్రాంతాన్ని, ఆంధ్రప్రజలను తూలనాడిన వ్యక్తి ఇప్పుడు ఏపీలో రాజకీయం చేస్తానంటూ ముందుకు రావడంతో.. ఆయనకు చెక్ పెట్టేందుకు ఏపీ జనం సమాయత్తమౌతున్నారు. బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షుడి నియామకం తరువాత రాష్ట్రంలో గతంలో ఏపీ లక్ష్యంగా, తెలంగాణలో స్థిరపడిన ఆంధ్రులు టార్గెట్ గా కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపైనే విస్తృతంగా చర్చ జరుగుతోంది. అంత మాత్రాన బీఆర్ఎస్ ప్రభావం ఏపీ రాజకీయాలపై ఏ మాత్రం ఉండదా అంటే కచ్చితంగా ఉంటుంది. నిజానికి, ఒక్కఎపీలోనే కాదు దేశంలో ఏ ఒక్క ఒక రాష్ట్రం నుంచి పేరున్న పార్టీలు ,వ్యక్తులు ఎవరు కూడా కేసేఆర్ తో చేతులు కలిపేందుకు, సిద్ధంగా లేరు. అయినా, ఆయన ప్రయత్నాలు ఆయన చేస్తున్నారు. చిన్నా చితక పార్టీలు, ప్రజాసంఘాలను కూడగట్టి జాతీయ రాజకీయాల్లో నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్నారు. సో.. బీఆర్ఎస్ ప్రభావం ఏపీ పై అసలే ఉందని చెప్పలేము, కానీ ఆ ప్రభావం ఎలా ఉంటుందనేది విషయంలో మాత్రం దాదాపు ఏకాభిప్రాయమే వ్యక్తమౌతోంది.
ఆయన ఏపీలో నిలదొక్కుకోవడం అంత వీజీ కాదనేదే. అన్నిటికీ మించి బీఆర్ఎస్ ఏపీలో ఎంట్రీ.. ఎవరు ఔనన్నా కాదన్నా దెబ్బకొట్టేది.. వైసీపీ ప్రయోజనాలనే అన్న అభిప్రాయం గట్టిగా వినిపిస్తోంది. కొవిడ్ సమయంలో ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఏపీ కొవిడ్ రోగులను సరిహద్దుల వద్దే అడ్డుకున్న కేసేఆర్, అదే సరిహద్దు దాటి ఏపీలో ఎంటర్ అవుతానంటే, ఎలా అనుమతిస్తామని జనం అంటున్నారు? తెలంగాణ ఉద్యమ సమయంలో కేసేఆర్ ఆంధ్రులను అవమానించిన తీరును ఎలా మరచిపోగలమంటున్నారు? నిన్నగాక మొన్న తెలంగాణ శాసన సభలో ఏపీపై విషం చిమ్మిన కేసీఆర్ కు రెడ్ కార్పెట్ వేసి స్వాగతం ఎందుకు పలుకుతారని ప్రశ్నిస్తున్నారు. కేసీఆర్, నేను మరిపోయాను నమ్మడానికి సిద్ధంగా లేమని తెగేసి చెబుతున్నారు. కేసీఆర్ పట్ల వ్యతిరేకతే ఆయన పార్టీని రెడ్ కార్పెట్ వేసి మరీ స్వాగతిస్తున్న వైపీపీపైనా పడక తప్పదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
నిజానికి ప్రాంతీయ వాదం పునాదిగా, రాజకీయంగా ఎదిగిన తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర రావు ఆయన అవసరాల కోసం తెలంగాణ సెంటిమెంట్ అస్త్రాన్ని, పక్కన పెట్టి జాతీయ నినాదాన్ని అందుకున్నారు. అందు కోసం ఆయన దసరా పండగ రోజున తెలంగాణ భవన్ వేదికగా, తెరాస పార్టీ పేరును మార్చారు. భారతీయ రాష్ట్ర సమితిగా నామకరణం చేశారు. ఒక విధంగా చెప్పాలంటే, జాతీయ రాజకీయాల్లో ఎంట్రీకి అడ్డుగా ఉన్న ‘తెలంగాణ’ అనే పదాన్ని తెసీసి ‘భారతీయ’ అనే పదాన్ని చేర్చారు. ప్రొఫెసర్ కోదండ రామ్’ చెప్పినట్లుగా తెరాస పేరు మార్పు వెనక ఉన్న మూల సూత్రం మాత్రం తెలంగాణలో అధికారాన్ని, కుటుంబ పాలనను నిలుపుకోవడం. ఇదొక్కటే ఇప్పుడు కేసీఅర్ ముందున్న లక్ష్యం. ఇదొక్కటే ఆయన ముందున్న సవాలు. తెలంగాణ సెంటిమెంట్ ను అడ్డు పెట్టుకుని 1200 యువకుల బలిదానాల బాటలో అధికార పీఠాన్ని అందుకున్న కేసేఆర్, వారి త్యాగాలన్నిటినీ విస్మరించి, ఇప్పుడు కొత్త దారిని ఎంచుకున్నారు. ఈ కొత్త దారికి అడ్డుపడేది ఏదైనా ఉంటే అది తెలంగాణ పదమే అన్న నిర్ణయానికి వచ్చి పార్టీలోని తెలంగాణ పేరును తుడిచేసి భారత్ అని చేర్చారు. ఈ మార్పు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను ఎలా ప్రభావితం చేస్తుంది. జాతీయ రాజకీయాలపై బీఆర్ఎస్ ప్రభావం ఎలా ఉంటుంది అన్నది పక్కన పెడితే, ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలను ఏ మేరకుప్రభావితం చేస్తుంది? అంటే.. ఏపీ జనులు మాత్రం బీఆర్ఎస్ కు ఇక్కడ స్థానం లేదని అంటున్నారని విశ్లేషకులు చెబుతున్నారు. ఆ పార్టీని భుజానికి ఎత్తుకుంటున్న వైకాపాను తిరస్కరించడానికి కూడా జనం సిద్ధంగా ఉన్నారని చెబుతున్నారు.